ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఇంట్రస్టింగ్.. సర్పంచ్ బరిలో మంత్రి సతీమణి నామినేషన్

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి భార్య నామినేషన్ దాఖలు చేశారు.

Published on: Nov 19, 2026, 15:33:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేడెక్కిన వేళ.. నంద్యాల జిల్లా బనగానపల్లి రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి బనగానపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ మేరకు ఆమె స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అధికారికంగా సమర్పించారు.

సర్పంచ్ బరిలో మంత్రి బీసీ జనార్దన్ భార్య
సర్పంచ్ బరిలో మంత్రి బీసీ జనార్దన్ భార్య

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇందిరా రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం అత్యంత సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జనార్దన్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. ఆయనతో పాటు కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం కూటమి నేతలు ఇందిరా రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఇందిరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన పోటీ వెనక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. 'బనగానపల్లి గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా ఏకైక లక్ష్యం. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, పంచాయతీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతోనే సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను.' అని ఆమె స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి సతీమణి స్వయంగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తుండటంతో బనగానపల్లి పంచాయతీ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తాయని నేతలు ప్రకటించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయడానికి ఈ ఎన్నిక ఎంతో కీలకమని, ఇందిరా రెడ్డి విజయం కోసం తామంతా ఎల్లప్పుడూ పాటుపడతామని కూటమి నాయకులు పేర్కొన్నారు.

మూడో విడత నోటిఫికేషన్

మరోవైపు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇప్పటికే ఈ నెల 13న తొలి విడత, 16న రెండో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, తాజా నోటిఫికేషన్‌తో మూడో దశ పోరుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.

నవంబర్ 21ఫారమ్-1లో ఎన్నికల నోటీసు జారీ, వార్డు వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు. నవంబర్ 21 నుంచి 23 వరకు అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు వేయవచ్చు. నవంబర్ 24 దాఖలైన నామినేషన్ల పరిశీలన చేస్తారు. నవంబర్ 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీలుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 26న నామినేషన్ అప్పీళ్లను పరిష్కారిస్తారు.

నవంబర్ 27 నామినేషన్ల ఉపసంహరణను మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 27న పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 2పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాల ప్రకటన మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More