ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు : జెడ్పీటీసీగా బొత్స కుమార్తె ఓటమి - గన్నవరంలో వైసీపీ విక్టరీ! పులివెందులలో ఇలా…

విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై తెదేపా అభ్యర్థి పాశల నీరజ 5,136 ఓట్లతో విజయం సాధించారు. గన్నవరంలో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు.

Published on: Nov 7, 2026, 19:47:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విజయనగరం జిల్లాలో వైకాపా సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో పోటీ చేసిన బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.

ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు - 2026 (AI Gemini Image)
ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు - 2026 (AI Gemini Image)

ఇక్కడ నుంచి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ (తెదేపా) అభ్యర్థి పాశల నీరజ, బొత్స అనూషపై ఏకంగా 5,136 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. స్థానిక జెడ్పీ ఛైర్‌పర్సన్ రేసులో ప్రధానంగా వినిపించిన అనూష ఓటమి పాలవడంతో వైకాపా శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. నీరజ విజయంతో బొండపల్లిలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాయి.

ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి నలుగురు అభ్యర్థులు జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి బొత్స తమ్ముడి కుమారుడు చైతన్య వేసిన నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది.

ఇక బొండపల్లి నుంచి కుమార్తె అనూష పోటీ చేసి ఓడిపోగా….. గరివిడి స్థానం నుంచి కోడలు బొత్స పూజిత, గుర్ల మండలం నుంచి బొత్స సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి బరిలో నిలిచారు. మరోవైపు…. ఎన్నికలకు ముందే తెదేపాలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.

గన్నవరంలో వైసీపీ జెండా.. కడప జిల్లాలో టీడీపీ హవా!

మరో కీలకమైన ఘట్టంలో…. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన కౌంటింగ్ పోరులో వైకాపా అభ్యర్థి అనగాని రవి తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామిపై విజయం సాధించారు. ఇక్కడ రీకౌంటింగ్ కోసం కూటమి నేతలు పట్టుబడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం…. అలాగే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. ఇక్కడ జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా… కడప జిల్లాలోని పలు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తన ఆధిక్యతను చాటుకుంది. వైఎస్సార్సీపీకి గట్టి పట్టున్న పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే మైదుకూరు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ ఏకంగా 18,903 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థిపై విజయం నమోదు చేశారు.

మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలోని జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా సాగుతోంది. పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. తిఎర్రావారిపాలెం మండల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊటుకూరి రెడ్డెమ్మ గారు 650 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More