...
...
Next Story

ఓటమి భయంతోనే ఏకగ్రీవాలు వద్దంటున్నారు - వైసీపీపై చంద్రబాబు ఫైర్

నదుల అనుసంధానంతో నీటి సమస్యకు పరిష్కారమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నర్సాపురంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన… సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకుసాగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదన్నారు.

Published on: Sep 1, 2026, 22:08:36 IST
Advertisement

పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సమ ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 31 ఏళ్ల క్రితం సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశానని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రజా చైతన్యం, ప్రజా భాగస్వామ్యం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు

పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని సీఎం చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాలకు పెంచిన పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.73,507 కోట్లను పెన్షన్ల రూపంలో పేదలకు అందించామని చెప్పారు. రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టి మహిళా సాధికారతకు బాటలు వేశామని చంద్రబాబు అన్నారు. ఏ ఆడబిడ్డా వంట కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దీపం పథకాన్ని తీసుకొచ్చామని, ఇప్పుడు దీపం-2.0 ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.

బటన్ నొక్కడం కాదు.. ఇంటింటికీ వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆర్థికంగా వెసులుబాటు కలిగించామని చెప్పారు. గ్రామంలో ఇంకా పేదలు ఉన్నారంటే ఆ గ్రామానికే అవమానమని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరవు నేలకు కృష్ణా జలాలు అందించామని తెలిపారు. శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవస్వామి పాదాల వరకు నీరు పారించామని చెప్పారు.

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వార్డు సభ్యులు, సర్పంచులు కూడా పాలనలో భాగం కావాలన్నారు. అప్పుడే కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధికి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం అన్నారు. ఓటమి భయంతోనే ఏకగ్రీవాలను వద్దని గొడ్డలి పార్టీ నేతలు చెబుతున్నారని అన్నారు. ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహించాయని…. మున్సిపాలిటీలు, ఆయారాం- గయారాం అనే పరిస్థితి లేకుండా కార్పోరేషన్లలో చైర్మన్, మేయర్ల ఎన్నికను ప్రత్యక్షం చేశామని అన్నారు. గొడ్డలి పార్టీ నేతలు బీసీ రిజర్వేషన్లను కూడా తగ్గించేశారని సీఎం ఆక్షేపించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్కుండా అడ్డుకోవటమే గొడ్డలి పార్టీ ఆలోచన అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని సీఎం స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe