విశాఖలో ఇళ్ల పట్టాల పండగ - ఒకేరోజు 28 వేల మందికి పట్టాల పంపిణీ! త్వరలోనే విజయవాడలోనూ
విశాఖ జిల్లాలోని 25,880 నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయనుంది. ఈ నెల 19న సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
పేద ప్రజల సంక్షేమానికి అండగా నిలిచే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో ఒకే రోజు ఏకంగా 25,880 నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల 19వ తేదీన విశాఖ వేదికగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని…. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న 25,880 కుటుంబాలకు వారి ఆస్తులపై పూర్తి స్థాయి హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు.

2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే…. వివిధ రకాల ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసముంటున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేలా పలు ముఖ్యమైన జీవోలను జారీ చేసింది. ఆ నిర్ణయాల ఫలితంగానే ఇప్పుడు ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 11 మండలాల పరిధిలో సుమారు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేస్తూ 25,880 మందికి ఆస్తి హక్కులు దక్కబోతున్నాయి.
మిగతా ప్రాంతాల్లోనూ….
రాష్ట్రంలో ఒక్క విశాఖ జిల్లాకే ఈ సేవలను పరిమితం చేయకుండా, రానున్న రోజుల్లో విజయవాడ నగరంలోనూ 24 వేల పేద కుటుంబాలకు చెందిన ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జీవో నంబర్ 30 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల్లో 12 వేల మందికి వారి ఇంటి స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పించారు.
మరో 9 వేల దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 5 వేల కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల స్థలాల పట్టాలను క్రమబద్ధీకరించారు.
పూర్తిగా హక్కులు - రెవెన్యూ మంత్రి అనగాని
అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు పేదలకు ఉచితంగా స్థలం కేటాయిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు. దీంతోపాటు వివిధ ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న కుటుంబాలకు వారి ఆస్తిపై హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని అసైన్ చేసి 10 ఏళ్లు దాటితే అటువంటి స్థలాలకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు. అలాగే గ్రామ కంఠాల్లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించామన్నారు.
అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా క్రమబద్దీకరణ చేస్తున్నామన్నారు. పేదవాడికి పూర్తి హక్కులతో ఇళ్లు అనే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆశలు, ఆకాంక్షలతో ఆటలాడుకుందని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామనే పేరుతొ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని అన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

