APSRTC Divyang Shakti : నేటి నుంచే ‘దివ్యాంగ శక్తి’ స్కీమ్ అమలు - ఇక పూర్తిగా ఉచిత ప్రయాణం, బస్ పాస్‌లు ఇలా తీసుకోండి

APSRTC Divyang Shakti : ఇవాళ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. దీంతో రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

Published on: Mar 18, 2026, 07:17:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ పథకానికి ఇవాళ అమరావతిలో శ్రీకారం చుడతారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నాను.

దివ్యాంగ శక్తి పథకం (images source @apsrtc)
దివ్యాంగ శక్తి పథకం (images source @apsrtc)

ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, 100 శాతం కంటి చూపు కోల్పోయిన వాళ్లకు, 100 శాతం మూగ, చెవిటి వారికి, అలాగే 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎస్‌ ఆర్టీసీ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వీరికి 50 శాతం రాయితీ లభిస్తోంది. 100 శాతం అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ లభిస్తోంది.

అయితే ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 40 శాతం… లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు అందరికీ స్త్రీశక్తి పథకం కింద వర్తించే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అంటే దివ్యాంగులు ఇకపై సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా రాష్ట్రమంతా ప్రయాణం చేసే వెసులుబాటు లభించింది. అంతేకాదు, వారితో పాటు వచ్చే సహాయకులకు ఈ బస్సుల్లో 50 శాతం రాయితీ లభిస్తుంది.

దివ్యాంగ శక్తి స్కీమ్ - ముఖ్యమైన వివరాలు:

  • ఇప్పటివరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని విస్తరించింది.
  • శారీరక-మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది.
  • ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ది చేకూరుతుండగా... పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది.
  • వీరిలో పురుషులు 6.86 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా... ఇకపై 1.60 లక్షల మంది సహాయకులకు 50 శాతం రాయితీ లభించనుంది.
  • దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్దిదారుల సంఖ్య 2.05 లక్షల నుంచి 12.76 లక్షలకు పెరిగనుందని ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
  • ఈరోజు నుంచి స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏపీఎస్‌ ఆర్టీసీలో సుమారు 73 శాతం బస్సులకు ఈ పథకాన్ని వర్తింప చేశారు.
  • ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి.

డిజిటల్ పాసులు…

ఈ స్కీమ్ కింద ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాస్‌లు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలో దివ్యాంగులకు సేవలు అందుతాయి. ఈ యాప్స్‌ను సదరం యాప్‌తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్‌తో ఉచిత డిజిటల్ పాస్‌లు జారీ చేస్తారు.

ఈ పథక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రూ.207 కోట్లు సబ్సిడీ అందిస్తుంది. గతేడాది ఆగస్ట్ 15న స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తే... ఈ మార్చి 15 నాటికి... అంటే 7 నెలల్లో 52 కోట్ల ప్రయాణాలు మహిళలు ఉచితంగా చేశారు. దీనికి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,826 కోట్లు రాయితీ భరించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More