Andhra Pradesh aqua sector Crisis : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పందించారు. ఈ సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు విడివిడిగా లేఖలు రాశారు.

భారతీయ రొయ్యల ఎగుమతులకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికా.. ప్రస్తుతం విధిస్తున్న 50 శాతం అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులపై ఏకంగా 60 శాతం పన్ను భారం పడుతోందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు రాసిన లేఖలో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగే ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై కోలుకోలేని దెబ్బ పడుతోందని వివరించారు.
ప్రస్తుతం ఏపీ నుంచి ఏటా జరుగుతున్న దాదాపు రూ. 25,000 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలతో పాటు, ఈ రంగంపై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న 30 లక్షల మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని లేఖలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఈ అస్థిరత వల్ల దేశీయ మార్కెట్లోనూ ఆక్వా ఉత్పత్తుల ధరలు ఊహించని విధంగా 20 నుండి 25 శాతం మేర పడిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే…. ఈ క్లిష్ట సమయంలో ఆక్వా రైతులకు నష్టం వాటిల్లకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలకమైన ముందస్తు చర్యలు తీసుకుందని చంద్రబాబు వివరించారు. రొయ్యల మేత (ఫీడ్) ధరపై కిలోకు రూ. 9 చొప్పున తగ్గించామని…. అలాగే ఆక్వా రంగానికి అత్యంత కీలకమైన నాణ్యమైన విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ. 1.50 లకే అందిస్తూ ప్రభుత్వం భారీగా భారాన్ని మోస్తోందని గుర్తుచేశారు.
సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు:
- అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలను తగ్గించేలా ఆ దేశ ప్రభుత్వంతో కేంద్రం తక్షణమే దౌత్యపరమైన చర్చలు జరపాలి. దీంతో పాటు రష్యా, యూరోపియన్ యూనియన్ (EU), ఆస్ట్రేలియా వంటి కొత్త ప్రత్యామ్నాయ అంతర్జాతీయ మార్కెట్లకు భారత రొయ్యల ఎగుమతులను పెంచేలా చర్యలు చేపట్టాలి.
- దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు వీలుగా భారత సాయుధ దళాల (Armed Forces) రోజువారీ ఆహారంలో రొయ్యలను కూడా ఒక భాగంగా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
- ఆక్వా రంగానికి వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను 30 శాతానికి పెంచాలి. వడ్డీ చెల్లింపులపై 240 రోజుల పాటు మారటోరియం విధించడంతో పాటు, 5 శాతం వడ్డీ సబ్సిడీ మరియు 5 శాతం జీఎస్టీ నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇవ్వాలి.
- ఆక్వా సాగు చేసే రైతులకు అండగా నిలిచేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణ పరిమితిని రూ. 1 లక్షకు పెంచాలి.
- దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లోని మార్కెట్లకు రొయ్యలను వేగంగా, సురక్షితంగా రవాణా చేయడం కోసం ప్రత్యేక శీతలీకరణ రైలు సౌకర్యాన్ని కల్పించాలి.
- ఆంధ్రప్రదేశ్‌లో 'ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ' ఏర్పాటు కోసం నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (NFDB) ద్వారా రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్‌ను మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరారు.
- ఆక్వా రంగంలో అత్యాధునిక పరిశోధనలు, రైతులకు సాంకేతిక సాయం అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా ఒక రీజినల్ ఫిషరీస్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని… లక్షలాది మంది జీవనోపాధిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై అత్యంత వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖల్లో ఆశాభావం వ్యక్తం చేశారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని… లక్షలాది మంది జీవనోపాధిని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై అత్యంత వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖల్లో ఆశాభావం వ్యక్తం చేశారు.
{{/usCountry}}