...
...
Next Story

వైసీపీవి క్రిమినల్ పాలిటిక్స్.... ఎన్నికలు జరగకుండా అరాచకాలు సృష్టిస్తోంది - సీఎం చంద్రబాబు విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడుతూ వైఎస్సార్‌సీపీ క్రిమినల్ రాజకీయం చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలపడమే జగన్‌ ఎజెండా అని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో 24 శాతం స్థానిక స్థానాల్ని ఏకగ్రీవం చేసుకుంది అరాచకాలతో కాదా..? అని ప్రశ్నించారు.

Published on: Oct 25, 2026, 07:16:57 IST
Advertisement

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి రాజకీయ పోరుకు దారితీసింది. నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం కొనసాగుతున్న వేళ అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్…. కూటమిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశారని ఆరోపిస్తున్నారు.

వైసీపీది క్రిమినల్ రాజకీయం - సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)
సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)

రాష్ట్రంలోని పరిస్థితులు, వైసీపీ ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన…. స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే వైఎస్సార్‌సీపీ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. పుంగనూరు, దర్శి, కడప, తంబళ్లపల్లె, తిరుపతి వంటి పలు ప్రాంతాల్లో ఆ పార్టీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించాయని పేర్కొన్నారు.

"వైఎస్సార్‌సీపీ పూర్తిస్థాయి క్రిమినల్ రాజకీయం చేస్తోంది," అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక వైఎస్సార్‌సీపీ ఎంపీ తన వాహనంతో ఎన్డీయే కార్యకర్తలను తొక్కింజేసేందుకు యత్నించారని ఆరోపిస్తూ, ఆ ఎంపీ కారులో మద్యం సీసాలు, ప్రాణాంతక ఆయుధాలు లభ్యమయ్యాయని మీడియాకు తెలిపారు. ఓట్ల లాభం కోసమే జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడుతూ, వాహనాలకు నిప్పు పెడుతోందని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు.

కనిగిరిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నామినేషన్ కేంద్రంలోకి చొరబడి పత్రాలను లాక్కున్నారని, తంబళ్లపల్లెలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి దిగారని చంద్రబాబు వివరించారు. కూటమి ప్రభుత్వంగా తాము రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. ఈ హింసాత్మక ఘటనలపై ప్రజలు విస్తృతంగా చర్చించాలని ఆయన కోరారు.

జగన్ సీబీఐ, ఈడీ కేసులతో పాటు అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్నారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ తన సొంత మేనకోడలి వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ…. మహాభారతంలోని 'కంసుడు' పాత్రతో జగన్‌ను సీఎం పోల్చారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 24 శాతం స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని గుర్తుచేసిన చంద్రబాబు…. ప్రస్తుత కూటమి పాలనలో ప్రజాస్వామ్యయుతంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు నమోదయ్యాయని గణాంకాలతో వివరించారు. ప్రస్తుతం 9,829 ఎమ్‌పీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన స్పష్టం చేశారు.

"28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకుగానూ 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కూటమి పార్టీల అభ్యర్థులు 27,772 నామినేషన్లు వేశారు. ఇక వైసీపీ వాళ్లు 20,556 వేశారు. 659 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 5,724 నామినేషన్లు దాఖలైతే.. వాటిలో కూటమి పార్టీలు 3,021, వైసీపీ తరపున 1,817 నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో 8,774 నామినేషన్లు కూటమి పార్టీల అభ్యర్థులు, 8,128 నామినేషన్లు వైసీపీ వాళ్లు వేశారు’ అని చంద్రబాబు వివరించారు.

"ఎన్నికల్లో వైసీపీ చేస్తున్న హింసాకాండతో రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమవుతుందోనని నేను ఆందోళన చెందుతుంటే, రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేసి రాజకీయ లబ్ధి పొందాలని జగన్‌ చూస్తున్నారు. ఒక అసత్యాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారు. వారానికి ఒకసారి బెంగళూరు నుంచి వచ్చి, మూడు గంటలు ప్రెస్‌మీట్‌ పెట్టి అబద్ధాలు ప్రచారం చేయడం జగన్‌కు అలవాటుగా మారింది’ అని సీఎం దుయ్యబట్టారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks