Bhogapuram Airport : భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమాన సర్వీసులు - తొలి విమానం ల్యాండింగ్!

ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరింది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం పౌర విమాన సర్వీసులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి విమానానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు.

Published on: Aug 17, 2026, 10:27:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ నుంచి సోమవారం (ఆగస్టు 17) పౌర విమాన రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో (IndiGo) సంస్థకు చెందిన తొలి విమానం ఈ రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ కావడంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

భోగాపురం ఎయిర్‌పోర్ట్
భోగాపురం ఎయిర్‌పోర్ట్

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని తొలి విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందజేసి వారి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు.

నూతన అధ్యాయానికి పునాది : రామ్మోహన్ నాయుడు

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ…. "అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడం అత్యంత సంతోషకరమైన, గర్వకారణమైన విషయం. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక నూతన శకాన్ని పరిచయం చేస్తూ, అనేక కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది" అని హర్షం వ్యక్తం చేశారు.

ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమానం ఇక్కడ ల్యాండ్ అవ్వగా, ఆ తర్వాత బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇక్కడికి చేరుకుంది. విమానాశ్రయంలోని మౌలిక వసతులు, అద్భుతమైన నిర్మాణ శైలి మరియు లభించిన సౌకర్యాలపై ప్రయాణికులు తీవ్ర ప్రశంసలు కురిపించినట్లు మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయం కేవలం కాంక్రీట్ భవనం మాత్రమే కాదని, మన చరిత్ర, సంస్కృతి మరియు వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.

ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన స్థానిక రైతులకు, ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జీఎంఆర్ (GMR) యాజమాన్యానికి కేంద్ర మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి సహకారం, అంకితభావం వల్లే ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ భారీ మౌలిక సదుపాయం సాకారమైందని కొనియాడారు. గతం నుంచి వెనుకబడిన ప్రాంతంగా పిలువబడుతున్న ఉత్తరాంధ్రకు ఈ ఎయిర్‌పోర్ట్ సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని, ఇక్కడ పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక కార్యకలాపాలు విశేషంగా పెరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పాత విమానాశ్రయంపై భావోద్వేగాలు…

వైజాగ్ (విశాఖపట్నం) పాత విమానాశ్రయంలో సాధారణ పౌర విమాన సర్వీసులు నిలిచిపోవడంపై స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్న భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అయితే, విశాఖ పాత విమానాశ్రయాన్ని జనరల్ ఏవియేషన్ (ప్రైవేట్ విమానాలు, చార్టర్డ్ సర్వీసులు) సేవలకు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అదే సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. నగరానికి దూరంగా ఉందనే ఇబ్బంది లేకుండా ప్రధాన రహదారులను విస్తరిస్తున్నామని, సింహాచలం వైపు నుండి సోంత్యం రహదారితో సహా 7 ప్రధాన రోడ్డు ప్రాజెక్టులను చేపట్టామని చెప్పారు. వీటితో పాటు తీర ప్రాంతం వెంట విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా అత్యంత వేగవంతమైన 'బీచ్ కారిడార్' రోడ్డు నిర్మాణానికి కూడా అనుమతులు లభించాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ప్రారంభంలో దూరభారం వల్ల కొంత అసౌకర్యం అనిపించినా… ఒక్కసారి ఎయిర్‌పోర్ట్ సౌకర్యాలు, ప్రపంచస్థాయి అనుభూతిని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరూ గర్వపడతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం పాత విమానాశ్రయం నుంచి ఆగస్టు 16 రాత్రి 10:45 గంటలకు ఢిల్లీ వెళ్లిన ఇండిగో (6E 2018) చివరి సర్వీసుతో అక్కడ సాధారణ పౌర విమాన ప్రయాణాలు ముగిశాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More