...
...
Next Story

బలహీనపడిన ‘మురసు’ తుఫాన్ - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి

తీవ్ర తుఫాను ‘మురసు’ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. తూర్పు తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ ప్రభావంతో… పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Published on: Nov 4, 2026, 11:04:10 IST
Advertisement

తీవ్ర తుఫానుగా విరుచుకుపడిన 'మురసు' క్రమంగా బలహీనపడుతోంది. ఇది తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) బుధవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. తదుపరి 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి సాధారణ అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు

వాతావరణ శాఖ ఉదయం 5:30 గంటల పరిశీలనల ప్రకారం…. ఈ అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తర దిశగా ప్రయాణించింది. బుధవారం ఉదయం 5:30 గంటల సమయానికి ఇది తూర్పు తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అక్షాంశం 17.0° ఉత్తరం, రేఖాంశం 80.1° తూర్పు సమీపంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు వాయవ్యంగా 30 కిలోమీటర్లు, తెలంగాణలోని ఖమ్మంకు దక్షణంగా 30 కిలోమీటర్లు, విజయవాడకు వాయవ్యంగా 80 కిలోమీటర్లు, నల్గొండకు తూర్పుగా 90 కిలోమీటర్లు మరియు భద్రాచలానికి నైరుతిగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. మచిలీపట్నం, విశాఖపట్నంలో ఉన్న డాప్లర్ వెదర్ రాడార్ల ద్వారా ఈ వాతావరణ పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

తీర ప్రాంతాలకు హెచ్చరికలు…

తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని… మంగళవారం రాత్రి నుంచే దాని తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎస్. కరుణా సాగర్ తెలిపారు. అయితే, దీని ప్రభావంతో బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…. ప్రభుత్వ అధికారుల సూచనలను తప్పక పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి మొదలైంది. బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 60,875 క్యూసెక్కులుగా ఉంది. 15 గేట్లను 2 అడుగులు, 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. సముద్రంలోకి 60,875 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా… ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులుగా ఉంది.

గోపాలపురం గ్రామంలోని పంచాయతీ కార్యాలయ కాలనీలో మురసు తుఫాన్ భారీ వర్షాలతో నివాస గృహాల్లోకి నీరు చేరింది. దీంతో కొవ్వూరు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. వృద్ధులను,మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు అందించారు.

తెలంగాణలోనూ వర్షాలు..

హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర ప్రకారం.. తెలంగాణలోనూ మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అలాగే ఆదిలాబాద్, కోమురంభం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరింనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ చూస్తే… సాయంత్రం వేళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి. కొన్ని ఏరియాల్లో ఉరుములతో కూడిన వానలు పడొచ్చు. ఉపరితల గాలులు ఈశాన్య దిశ నుంచి వీచే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks