AP Cyclone Alert : దూసుకొస్తున్న తుఫాన్... ఈనెల 29 వరకు ఏపీలో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతోంది. అక్టోబర్ 28న తీవ్ర తుపానుగా బాపట్ల -విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది రాబోయే కొద్ది రోజుల్లో క్రమంగా తుపానుగా, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపాను తీవ్ర రూపం దాల్చి అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది.

శనివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో తూర్పు-మధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఈ వాయుగుండం స్థిరపడింది. ఇది శ్రీ విజయ పురానికి (అండమాన్ దీవులు) ఉత్తర-వాయవ్యంగా 510 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,020 కిలోమీటర్లు, బాపట్లకు 1,100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ శాఖ ఇచ్చిన ముందస్తు అంచనాల ప్రకారం….. ఈ వ్యవస్థ మొదట దక్షిణ దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. ఆపై అక్టోబర్ 26న ఉదయానికి బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుంది. అక్టోబర్ 27న ఉదయానికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈనెల 28న తీరం దాటే అవకాశం…
ఈ తీవ్ర తుపాను మరింత బలపడి 'అత్యంత తీవ్ర తుపాను'గా రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకువస్తుంది. అక్టోబర్ 28న ఉదయం వేళ బాపట్ల మరియు విశాఖపట్నం మధ్య ఏపీ, యానాం తీరాలను ఇది దాటే అవకాశం ఉందని IMD అధికారులు స్పష్టం చేశారు. తీరం దాటే సమయంలో గాలి వేగం గంటకు 115 నుండి 125 కిలోమీటర్ల వరకు ఉంటుందని…. ఈ ఈదురుగాలుల ధాటి గరిష్టంగా 140 కిలోమీటర్ల వరకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో అక్టోబర్ 26 నుండి 29 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
- అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో : కోస్తాంధ్ర, యానాం మరియు రాయలసీమల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- అక్టోబర్ 27 మరియు 28న : కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుండి అతిభారీ వర్షాలు, అలాగే కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- అక్టోబర్ 29న: కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి.
ఒడ్డుకు చేరుకున్న పడవలుతీరప్రాంత మత్స్యకారులు ఎవరూ అక్టోబర్ 29 వరకు వేటకు వెళ్లకూడదని అధికారులు ఇప్పటికే కఠిన ఆదేశాలు ఇచ్చారు. సముద్రంలో ఉన్న బోట్లను తక్షణమే ఒడ్డుకు రప్పించాలని మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల్లో బోట్ల ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. శనివారం నాటికి 29,952 బోట్లు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన 91 బోట్లు కూడా రాత్రికి తీరానికి చేరుకునేలా మత్స్యశాఖ చర్యలు ముమ్మరం చేసింది.
సీఎం చంద్రబాబు సమీక్ష…
మత్స్యకారుల ప్రాణరక్షణకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, బోట్లు, వలలు దెబ్బతినకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.పరిస్థితి తీవ్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రమాదం పొంచి ఉన్నందున యంత్రాంగం అంతా పూర్తి సన్నాహాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని… తీరప్రాంత ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

