...
...
Next Story

Cyclone Arnab : అర్నబ్ తుపాన్‌ ఎఫెక్ట్.. కోనసీమలో పడిపోయిన 33 వేల కొబ్బరిచెట్లు

Cyclone Arnab : అర్నబ్ తుపాన్‌పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుపాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపుపై అధికారులతో మాట్లాడారు.

Published on: Oct 28, 2026, 15:59:05 IST
Advertisement

అర్నబ్ తుపాన్‌ నేపథ్యంలో కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. జిల్లాల వారీగా పరిస్థితులను, గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను ముఖ్యమంత్రికి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సమీక్షలో చంద్రబాబు
సమీక్షలో చంద్రబాబు

కోనసీమలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్టు ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల చెట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలిపోయినట్లు వివరణ ఇచ్చారు. జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు అధికారులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో కూలిన చెట్ల తొలగింపు పనులను వెంటనే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అధికారుల వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుపాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం ఏపీసీపీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని పంపాలన్నారు.

పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి, సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు.

విద్యుత్ సరఫరా, తాగునీరు, రాకపోకలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు అన్నారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని 26 తుపాన్లు తాకాయని, గతంలో సంభవించిన దివిసీమ ఉప్పెనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని గుర్తుచేశారు. దివిసీమ ఉప్పెన, హుద్ హుదు, తిత్లీ తుపాన్ల సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయన్నారు. వరదల సమయంలో అప్పటి ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవస్థలు విఫలమయ్యాయన్నారు.

బుడమేరు వరదల్లో విజయవాడలోనే ఉండి వ్యవస్థను గాడిలో పెట్టగలిగామని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం అర్నబ్ తుపానులో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయని చెప్పారు. రాష్ట్రాన్ని తాకిన ప్రతి తుపాన్ నుంచి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే పాఠాలను నేర్చుకుంటున్నామన్నారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలుగుతున్నామన్నారు.

'అన్ని స్థాయిల్లో అధికారులు ఒకే విధమైన ఆలోచనతో పనిచేస్తూ, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు, వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాం. ప్రకృతి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా తక్షణ నిర్ణయాలు తీసుకుని, వాటిని సమర్థంగా అమలు చేయాలి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగు మార్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలను సమీక్షిస్తున్నాం.' అని చంద్రబాబు చెప్పారు.

అర్నబ్ తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలెవరూ అత్యంత అవసరమైతే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం సాయంత్రం వరకూ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కురిసే సమయంలో ఎవరైనా బయటకు వస్తే భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు వంటివి నేలకొరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పింది. కావున తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలెవరూ సాయంత్రం వరకు ఇళ్ళ నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks