Vijayasai Reddy New Party : ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తి - 'పరివర్తన రాజనీతి పార్టీ'ని ప్రకటించిన విజయసాయిరెడ్డి
వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నూతన పార్టీకి 'పరివర్తన రాజనీతి పార్టీ' (PRP)గా నామకరణం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీకి బీజం పడింది. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి నూతన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. గత కొంతకాలంగా మారుతున్న పరిణామాల మధ్య ఆయన సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తన నూతన రాజకీయ వేదికకు 'పరివర్తన రాజనీతి పార్టీ' (Parivarthana Rajaneethi Party - PRP) అని పేరు నిర్ణయించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన విధానాలతో ముందుకు సాగేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 'పరివర్తన' అనగా మార్పు అని….. ప్రజలకు జవాబుదారీగా ఉండే నిజమైన రాజనీతిని అందించడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
జెండా గుర్తు విడుదల…
కాషాయం, తెలుపు రంగుల సమ్మేళనంతో రూపొందించిన పార్టీ జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తును పార్టీ ప్రాథమిక చిహ్నంగా విజయసాయిరెడ్డి వెల్లడించారు. దేశభక్తి, ప్రజల సంక్షేమం, ధర్మబద్ధమైన రాజనీతికి సంకేతంగా ఈ చిహ్నాన్ని ఎంచుకున్నట్లు వివరించారు.
"జనం కోసం.. జన హితం కోసం" అనే ప్రధాన నినాదంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ కూటములు, సాంప్రదాయ పార్టీల తీరుకు భిన్నంగా ప్రజలకు బలమైన మూడో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు.
నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జెన్-జీ (Gen Z) యువతను రేపటి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే ఒక కార్యాచరణ ఫ్యాక్టరీలా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా పాలన సాగించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.
వైఎస్సార్‌సీపీలో సుదీర్ఘకాలం పాటు అత్యంత కీలక నేతగా, పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలు నిర్వర్తించిన విజయసాయిరెడ్డి… కొద్ది నెలలక కిందటే పార్టీకి మరియు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు రాగా…. వాటన్నింటికీ తెరదించుతూ నేరుగా కొత్త పార్టీ ప్రకటన చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమ కొత్త పార్టీ ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను కాపాడటమేనని విజయసాయిరెడ్డి చెప్పారు. ఢిల్లీలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ…. కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ ఏపీ ప్రజలకు దక్కాల్సిన న్యాయాన్ని, నిధులను రాబట్టడానికి తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వివరించారు.
ఒకప్పుడు వైఎస్సార్‌సీపీలో అత్యంత కీలక నాయకుడిగా వెలుగొందిన విజయసాయిరెడ్డి…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించేవారు. అయితే ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన ఆయన…. ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీని ప్రకటించి ముందుకు వెళ్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

