Tirumala Brahmotsavam Garuda Seva : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక ఉత్సాహంతో, కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి అత్యంత విశిష్టమైన, పవిత్రమైన గరుడసేవ వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, విదేశీ సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దివ్యానుభూతిని అందించారు.

ముందుగా గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, మహిళల కోలాటాలు, జీయ్యంగార్ల దివ్యప్రబంధ ఘోష, మంగళవాయిద్యాల మంత్రముగ్ధ రవళుల నడుమ స్వామివారి ఊరేగింపు పరమ భక్తిభావంతో సాగింది. మాడ వీధుల్లో వేచి ఉన్న అపార భక్తజనం అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ “గోవిందా… గోవిందా…” అంటూ చేసిన నామస్మరణతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి. మలయప్ప స్వామివారి దివ్య మంగళ రూపాన్ని కళ్లారా తిలకించి భక్తులు మైమరిచిపోయారు.
గరుడసేవకు విశిష్ట ఆధ్యాత్మిక ప్రాశస్త్యం….
సనాతన ధర్మంలో…. ముఖ్యంగా 108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వేద స్వరూపుడైన గరుత్మంతుడు జ్ఞానానికి, వైరాగ్యానికి ప్రతీక. వేదాల సారాన్ని తన రెక్కలుగా చేసుకుని స్వామివారిని మోసే గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామిని దర్శించుకోవడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని, భక్తులకు జ్ఞానవైరాగ్యాలు ప్రాప్తిస్తాయని అర్చకులు, పండితులు విశ్వసిస్తారు. అందుకే బ్రహ్మోత్సవాలన్నింటిలోనూ గరుడ సేవ అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది.
ఈ అత్యంత వైభవంగా జరిగిన గరుడసేవ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వేంకటేశ్వర్, జేఈవోలు డాక్టర్ ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ మరియు ఇతర పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.