Andhrapradesh : 'ఏఐ'తో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు - 'టచ్' చేయకుండానే...।

ఆంధ్రప్రదేశ్‌లో నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం సరికొత్త ఏఐ (కృత్రిమ మేధస్సు) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. శిశువును తాకకుండానే కేవలం మొబైల్ వీడియో ద్వారా బరువు, ఎత్తు కొలిచే సాంకేతికతను తీసుకురానుంది.

Published on: Jun 7, 2026, 05:12:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు, పర్యవేక్షణలో సరికొత్త విప్లవానికి నాంది పలకబోతున్నారు. వైద్యారోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ - కృత్రిమ మేధస్సు) ఆధారిత సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో దైనందిన విధులను నిర్వహించే ఆశా (ASHA) కార్యకర్తలు ఉపయోగించే అధికారిక మొబైల్ యాప్‌లోనే ఈ సరికొత్త ఏఐ ఫీచర్‌ను అనుసంధానం చేయనున్నారు.

నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు
నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో కుదుర్చుకున్న ప్రత్యేక అవగాహన ఒప్పందంలో భాగంగా ప్రముఖ సాంకేతిక సంస్థ 'వాద్వానీ-ఏఐ' (Wadhwani-AI) ఈ సరికొత్త 'శిశు మాపన్ యాప్'ను రూపకల్పన చేసింది. ఈ యాప్ ద్వారా నవజాత శిశువుల శారీరక ఎదుగుదలకు సంబంధించిన కీలక పారామీటర్లయిన బరువు, ఎత్తు, ఛాతీ, భుజం భాగం, తల చుట్టుకొలతల వివరాలను సులభంగా నమోదు చేయవచ్చు.

ఏఐ సాంకేతికతను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ముందు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌కు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం సుమారు 1,000 మంది నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాలకు సంబంధించిన వివరాలను రికార్డు చేసిన వీడియోల రూపంలో ఒక బృహత్తర డేటా బేస్‌ను ఏఐకి అందించనున్నారు.

మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని వేదికగా ఎంచుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇందిరానగర్, కొప్పురావు కాలనీ, కాజా, ఎర్రబాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు పెదవడ్లపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలోని సుమారు 1,000 మంది నవజాత శిశువులను ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు.

  • ఈ ప్రాంతాల్లోని నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాలను 'శిశు మాపన్' యాప్ ఆధారంగా గుర్తించేందుకు అధికారిక యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.
  • ఇందుకోసం సదరు ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో విధులు నిర్వర్తించే ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎం (ANM)లకు దశల వారీగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు.
  • ఇక్కడ వచ్చే ఫలితాలు, ఖచ్చితత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఈ ఏఐ ఆధారిత సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు విస్తరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
  • ఈ ఆధునిక సాంకేతికత వల్ల ఆశాలు, ఏఎన్ఎంలపై క్షేత్రస్థాయిలో పనిభారం గణనీయంగా తగ్గుతుందని…. అదే సమయంలో శిశువుల ఆరోగ్య సంరక్షణకు మరింత మెరుగైన భరోసా లభిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం…. ఒక శిశువు జన్మించినప్పటి నుంచి పుట్టిన రోజును మినహాయించి మొదటి 42 రోజుల్లోగా మొత్తం ఆరుసార్లు ఆశా కార్యకర్తలు సదరు శిశువు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. 'హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్' (HBNC) విధానంలో భాగంగా శిశువు పుట్టిన 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు మరియు 42వ రోజున వారి ఇళ్లను సందర్శించి, శిశువు తల చుట్టుకొలత, ఛాతీ వైశాల్యం, చేతి చుట్టుకొలతతో పాటు బరువు, ఎత్తుల వివరాలను సేకరించి యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ పాత పద్ధతిలో శిశువుల కొలతలను గుర్తించడం కోసం ఆశా కార్యకర్తలు భారీ బరువుండే వెయింగ్ మిషన్లు, ఇన్ ఫాంటో మీటర్లు (Infantometer), కొలత టేపులను వెంట పట్టుకుని ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరికరాలను మోస్తూ నవజాత శిశువుల ఇళ్లకు వెళ్లడం ఆశాలకు పెద్ద అవస్థగా మారింది. అంతేకాకుండా, ఒక్కో శిశువు ఇంటి వద్ద ఈ కొలతలు తీయడానికి కనీసం 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు సమయం పడుతోంది. పైగా చిన్న పిల్లలు కొలతలు తీసేటప్పుడు ఒకేచోట స్థిరంగా ఉండకపోవడం…. ఏడవడం లేదా అసౌకర్యానికి గురికావడం వల్ల ఖచ్చితమైన కొలతలు నమోదు చేయడం కూడా క్లిష్టంగా మారుతోంది.

'టచ్' చేయకుండానే కొలతల గుర్తింపు!

ఈ ఇబ్బందులన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతూ వాద్వానీ ఏఐ సంస్థ ఈ 'శిశు మాపన్' యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త టెక్నాలజీ వల్ల ఆశా కార్యకర్తలు శిశువును కనీసం తాకాల్సిన (టచ్ చేయాల్సిన) అవసరం కూడా ఉండదు.

  • యాప్ డౌన్‌లోడ్ చేసిన స్మార్ట్‌ఫోన్ కెమెరాను శిశువుకు దగ్గరగా ఉంచి ఒక చిన్న వీడియో తీస్తే చాలు, అత్యంత తక్కువ వ్యవధిలోనే శిశువు బరువు, ఎత్తు, ఛాతీ, భుజం కింద భాగం, తల చుట్టుకొలత వంటి అన్ని నిర్దేశిత ప్రమాణాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో రికార్డ్ అయిపోతాయి.
  • మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో భౌగోళిక, వాతావరణ పరిస్థితులను బట్టి శిశువుల శరీరతత్వం, ఎదుగుదల వేర్వేరుగా ఉంటాయి. ఈ వైవిధ్యాన్ని గుర్తించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు వెయ్యి మంది శిశువుల ఆరోగ్య ప్రమాణాల వీడియో డేటా బేస్‌ను ఏఐ సిస్టమ్‌కు వైద్య ఆరోగ్య శాఖ ఫీడ్ చేస్తోంది.
  • ఈ డేటా బేస్ విశ్లేషణ పూర్తయిన తర్వాత, సదరు ఫీచర్లను ఆశాల రెగ్యులర్ యాప్‌లో విలీనం (ఇంటిగ్రేట్) చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
  • మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఆశాలు, ఏఎన్ఎంలకు దశల వారీగా శిక్షణ ఇచ్చి, ఫీల్డ్‌లో శిశువుల వీడియోలను సేకరించే ప్రక్రియను వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రారంభించింది.

ఈ 'శిశు మాపన్' యాప్ ద్వారా అతి తక్కువ సమయంలోనే నవజాత శిశువులలో ఏవైనా పోషకాహార లోపాలు లేదా ఎదుగుదల లోపాలు ఉన్నట్లయితే తక్షణమే గుర్తించవచ్చు. ఒకవేళ ఏఐ రీడింగ్స్‌లో లోపాలు ఉన్నట్లు తేలితే, ఆ సమాచారం వెంటనే సంబంధిత ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు (Medical Officers) ఆటోమేటిక్ 'అలర్ట్' రూపంలో చేరుకుంటుంది.

దీనివల్ల బాధితులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని, శిశు మరణాల రేటును తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ వివరించారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా తీసే ఈ వీడియో రీడింగ్స్‌లో అత్యుత్తమ ఖచ్చితత్వం ఉంటుందని…. కొలతల గుర్తింపులో ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని ఆయన స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More