Rains School Holiday : ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ అలెర్ట్.. పాఠశాలలకు సెలవు
Rains School Holiday : ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండ్రోజులు వానలు పడనున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో తీవ్రవాయుగుండంగా మారనుంది. ఇది వేగంగా కదులుతూ విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో అత్యంత భారీ నుంచి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

తీరం వెంట గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు ఉత్తర కోస్తాకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలెర్ట్ జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ముప్పు పొంచి ఉంది. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ సూచనల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ 20 సెం.మీ కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరికి ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
వర్ష తీవ్రత పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు నదులు, గెడ్డలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. విజయనగరం జిల్లా గింజేరు గెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారిపై నీరు చేరడంతో వాహనాలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. విపత్తు పరిస్థితుల దృష్ట్యా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు.
తీర ప్రాంత ప్రజల భద్రత కోసం పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని సచివాలయాల పరిధిలో తక్షణ పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. కలెక్టర్లు రాంసుందర్ రెడ్డి (విజయనగరం), ప్రభాకర్ రెడ్డి (పార్వతీపురం మన్యం) అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు, బాధితులు సహాయం కోసం సంప్రదించాల్సిన 24/7 అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశారు.
విజయనగరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08922-236947, పార్వతీపురం మన్యం కంట్రోల్ రూమ్ 08963-450347కు అత్యవసర సమయాల్లో కాల్ చేయవచ్చు. తీరప్రాంతాల ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా, అధికారికంగా ఇచ్చే వాతావరణ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


