ప్రకృతి ప్రేమికులకు, వారాంతాల్లో సరదాగా గడపాలనుకునే పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతులను అందించేందుకు IRCTC టూరిజం సిద్ధమైంది. పచ్చని కొండల పకృతి రమణీయతకు నిలయమైన అరకు వ్యాలీని సందర్శించడానికి 'విశాఖపట్నం-అరకు-విశాఖపట్నం' (రైల్ కమ్ రోడ్) పేరిట ఒక రోజు (01 Day) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రతిరోజూ అందుబాటులో ఉండే ఈ టూర్ ప్యాకేజీ ద్వారా పర్యాటకులు ఎంతో సౌకర్యవంతంగా అరకు అందాలను చూసి రావొచ్చు.
- షెడ్యూల్ ప్రకారం…. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 07:00 గంటలకు రైలు నంబర్ 58501 ద్వారా ప్రారంభమవుతుంది.
- రైలు ప్రయాణంలో దారిపొడవునా వచ్చే అందమైన కొండలు, లోయలు, అనేక సొరంగాలు (Tunnels) మరియు వంతెనల గుండా ప్రయాణిస్తూ ఉదయం 11:00 గంటలకు అరకు స్టేషన్ చేరుకుంటారు. అ
- క్కడి నుంచి ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక నాన్-ఏసీ వాహనంలో స్థానిక పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది.
- ఈ టూర్‌లో భాగంగా అరకులోని ప్రసిద్ధ గిరిజన మ్యూజియం, పద్మాపురం బొటానికల్ గార్డెన్ చూస్తారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ముగించుకుని, తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్ మరియు అద్భుతమైన బొర్రా గుహలను (Borra Caves) సందర్శిస్తారు. రాత్రికి తిరిగి వైజాగ్ చేరుకోవడంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
- పర్యాటకుల సౌకర్యార్థం ఈ ప్యాకేజీని రెండు విభాగాలుగా (Comfort - EV, Standard - SL) వర్గీకరించారు. మీరు ఎంచుకునే సీటింగ్, ప్రయాణికుల సంఖ్యను బట్టి ధరలు మారుతుంటాయి
టికెట్ ధరలు…

కంఫర్ట్ క్లాస్ (Comfort - EV విస్టాడోమ్ కోచ్) లో ఒక్కరే ప్రయాణిస్తే రూ. 6,545, ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 4,055, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 3,225, నలుగురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 2,810గా ఉంటుంది.
స్టాండర్డ్ క్లాస్ (Standard - SL స్లీపర్ కోచ్)లో అయితే ఒక్కరే ప్రయాణిస్తే (Single Occupancy) రూ. 5,650, ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 3,160, ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 2,330, నలుగురు కలిసి ప్రయాణిస్తే ఒకరికి రూ. 1,915గా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com) ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్ రద్దు చేసుకోవాల్సి వస్తే ఆన్‌లైన్ ద్వారానే రద్దు చేసుకోవాలి, పీఆర్‌ఎస్ కౌంటర్లలో ఇది సాధ్యం కాదు. ప్రయాణ తేదీకి 15 రోజుల ముందు రద్దు చేసుకుంటే ఒక ప్రయాణికుడికి రూ. 250 చొప్పున కట్ అవుతుంది. 8 నుంచి 14 రోజుల ముందు అయితే ప్యాకేజీ ధరలో 25 శాతం, 4 నుంచి 7 రోజుల ముందు అయితే 50 శాతం నిధులు కోత విధిస్తారు. ప్రయాణానికి 4 రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ లభించదు. ఏవైనా సందేహాలుంటే వైజాగ్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని లేదా 9550166168, 9281495847 నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చు.