...
...
Next Story

Janasena Party : స్థానిక ఎన్నికలపై 'జనసేన ఫోకస్' - క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా వ్యూహాలు..!

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ప్రణాళికాబద్ధంగా వ్యూహాలు అమలు చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.

Published on: Sep 23, 2026, 11:00:51 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్

మంగళవారం మధ్యాహ్నం కాకినాడ వేదికగా జనసేన ముఖ్య నాయకులతో ఆయన… కీలక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నాయకులకు సమగ్రమైన దిశానిర్దేశం చేశారు.

కాకినాడలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో జనసేన పార్టీకి చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు), శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు), వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొచ్ఛారు. వీరితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమించిన సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు మరియు సపోర్ట్ టీమ్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రత్యేక కమిటీలు…

రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేయాలి, ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏ రీతిలో తీసుకెళ్లాలనే దానిపై ఆయన విధివిధానాలను ఖరారు చేశారు.

ప్రజాసమస్యల పరిష్కారంతో పాటు, గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని భాగస్వాములను చేస్తూ ఎన్నికలకు పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కీలక వ్యాఖ్యలు…

పిఠాపురంలో జనసేన పార్టీ కమిటీ సరిగ్గా పనిచేయడం లేదని.. అధికారం వచ్చాక నేతలు చల్లబడ్డారన్నారు. నేతలు చల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలో తనకు తెలుసని.. అధికారులు తన క్యాంప్ ఆఫీస్ పిఠాపురంలో పెట్టాలని అధికారులకు సూచిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇక పార్టీకి బలమున్న ప్రతీ చోట పోటీ చేయాలని పవన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. పొత్తుల లెక్కల్లో భాగంగా ఎక్కడైనా సీట్లు దక్కకుంటే స్నేహ పూర్వక పోటీకి దిగాలని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రధానంగా ఈ స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు సీట్లు ఇచ్చి పార్టీని బలోపేతం చేసుకోవాలని జనసేనాని సూచించినట్లు తెలుస్తోంది.

మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లలో పోటీ చేసి క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటిన జనసేన… ఈ స్థానిక ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాల్లో పాగా వేయాలని చూస్తోంది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే…. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వ్యూహాలు రచిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks