ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపైకి చేరుకోవడానికి రెండో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(VMRDA) వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉన్న ఒక్కటే ఘాట్ రోడ్డుపై పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్నారు.

విశాఖపట్నం పర్యటనకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించే పర్యాటక ప్రాంతాల్లో కైలాసగిరి ప్రథమ వరసలో ఉంటుంది. ప్రస్తుతం కొండపైకి వెళ్లేందుకు ఒకే ఒక ప్రధాన రహదారి అందుబాటులో ఉంది. వారంతాంతాలు, సెలవు దినాలు, పండగల సమయాల్లో పర్యాటకుల రాక విపరీతంగా పెరగడంతో ఈ మార్గంలో తరచూ తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.
రెండో ఘాట్ రోడ్డు అందుబాటులోకి వస్తే కొండపైకి వెళ్లేందుకు, కిందికి దిగేందుకు వేర్వేరు మార్గాలను కేటాయించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణ, పర్యాటకుల భద్రత పెరుగుతుంది.
VMRDA ఇన్‌ఛార్జ్ కమిషనర్ కేతన్ గర్గ్ ఇటీవల కైలాసగిరి ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి ఉన్నతాధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపాదిత రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన, డిజైన్, సర్వే పనులను తక్షణమే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కైలాసగిరి అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రతిపాదించిన ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు.
కొండపైకి వచ్చే సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులు, కాటేజీలు, ల్యాండ్‌స్కేపింగ్, రాత్రి వేళల్లో బస చేసే వసతుల మెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. కైలాసగిరి నుంచి సముద్ర తీరం, నగర సౌందర్యాన్ని తిలకించేందుకు రోప్‌వే, టాయ్ ట్రైన్, శివపార్వతుల విగ్రహాలు, టైటానిక్ వ్యూ పాయింట్ వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని VMRDA భావిస్తోంది.
ఈ రెండో ఘాట్ రోడ్డు ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం పర్యాటక రంగానికి మరింత ఊపు రావడమే కాకుండా, నగర రవాణా వ్యవస్థలో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది. కైలాసగిరిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని, మాస్టర్ ప్లాన్ తయారుచేయాలని వీఎంఆర్డీఏ భావిస్తోంది.
{{/usCountry}}ఈ రెండో ఘాట్ రోడ్డు ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం పర్యాటక రంగానికి మరింత ఊపు రావడమే కాకుండా, నగర రవాణా వ్యవస్థలో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది. కైలాసగిరిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని, మాస్టర్ ప్లాన్ తయారుచేయాలని వీఎంఆర్డీఏ భావిస్తోంది.
{{/usCountry}}