పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలను కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖ చేసిన కొన్ని ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం(సీయస్‌యస్) కింద రాష్ట్ర ప్రభుత్వమే పిడుగురాళ్ల కళాశాలను నిర్మించి, నిర్వహించనుంది. ఈ పథకం కింద కేంద్రం పిడుగురాళ్ల కళాశాలకు రూ.195 కోట్ల సహాయాన్ని మంజూరు చేసి రాష్ట్రానికి విడుదల చేసింది.

మొదటి దశలో 100 ప్రవేశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) ప్రస్తుత నిబంధనల మేరకు 100 ఎంబీబీఎస్ ప్రవేశాలకు 420 పడకలతో కూడిన బోధనాసుపత్రిని సమకూర్చాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వం 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 330 పడకల సామర్ధ్యం కలిగిన జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు అనుమతించింది. మారిన ఎన్ఎంసీ నిబంధనల మేరకు 420 పడకల ఆసుపత్రి అవసరం కాగా ఈ దిశగా ఆసుపత్రిని విస్తరించేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. పిడుగురాళ్ల వైద్య కళాశాలకు 237 మంది వైద్యులు, ఇతర సిబ్బందితో పాటు బోధానాసుపత్రికి 600 మంది సిబ్బందిని సమకూర్చేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత ప్రభుత్వం నిర్మించాలనుకున్న మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు చొప్పున మొత్తం 2,500 ఎంబీబీఎస్ ప్రవేశాలకు ప్రణాళికలు రచించి, నిర్మాణాలు చేపట్టామని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో కేవలం 100 ప్రవేశాలకు మాత్రమే అనుమతిస్తూ 20.8.2020న మెమో నంబరు 2980561ని జారీ చేసిందని మంత్రి వెల్లడించారు. ఇదే రీతిన పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా జగన్ ప్రభుత్వం ఎన్ఎంసీ నుండి 100 ఎంబీబీఎస్ ప్రవేశాలకు మాత్రమే అనుమతి పొందిందని మంత్రి తెలిపారు.
2023లో సవరించిన ఎన్ఎంసీ నిబంధనల మేరకు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసుకునే నాటికే 150 ప్రవేశాలకు 620 పడకలతో కూడిన బోధానాసుపత్రి సిద్ధంగా ఉండాలని, మొదటి దశలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 ప్రవేశాలు కల్పించి అనంతరం అదనపు ప్రవేశాల కోసం చర్యలు చేపడతామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
{{/usCountry}}2023లో సవరించిన ఎన్ఎంసీ నిబంధనల మేరకు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసుకునే నాటికే 150 ప్రవేశాలకు 620 పడకలతో కూడిన బోధానాసుపత్రి సిద్ధంగా ఉండాలని, మొదటి దశలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 ప్రవేశాలు కల్పించి అనంతరం అదనపు ప్రవేశాల కోసం చర్యలు చేపడతామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
{{/usCountry}}