గ్రూప్స్ కోచింగ్ కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌కు.. యువకుడితో లివింగ్ రిలేషన్‌.. భర్తకు తెలిసి!

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రూప్స్ కోచింగ్ కోసం ఓ యువతి హైదరాబాద్ వచ్చింది. ఇంటికి రమ్మని తల్లి పిలవడంతో వెళ్లింది.. ఆ తర్వాత దారుణం జరిగింది.

Published on: Jun 11, 2026, 11:21:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కలకలం రేపిన ఒక పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నకూతురు వేరే వ్యక్తితో లివింగ్ రిలేషన్‌లో ఉందన్న కోపంతో, కుటుంబ పరువు పోతుందనే నెపంతో కన్నతల్లే ఆమెను దారుణంగా హతమార్చింది. ఈ ఘాతుకానికి మృతురాలి భర్త, తాత పూర్తిగా సహకరించారు. గుండెపోటుతో చనిపోయిందని నమ్మించి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు ముగించినప్పటికీ, పోలీసుల చాకచక్యంతో ఈ హంతకుల గుట్టు రట్టయింది.

శ్రీకాకుళం క్రైమ్ న్యూస్
శ్రీకాకుళం క్రైమ్ న్యూస్

అసలు ఏం జరిగింది?

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సోర్లిగాం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దుంపల హరిణి (24) అనే వివాహిత తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. మృతురాలు హరిణికి 2020లో ఆమె మేనమామ అయిన దంతేశ్వరరావుతో వివాహం చేశారు. వీరికి నాలుగు ఏళ్ల కుమారుడు ఉన్నాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత హరిణి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం కోసం హైదరాబాద్ వెళ్లింది. ఎస్‌.ఆర్‌. నగర్‌లోని ఒక హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు సుధా నాగేంద్ర అనే యువకుడితో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారి, వారిద్దరూ లివింగ్ రిలేషన్‌లో ఉండటం ప్రారంభించారు.

ఈ విషయం ఊరిలో ఉన్న భర్త దంతేశ్వరరావుకు, తల్లి విజయకుమారికి తెలియడంతో హరిణిని తీవ్రంగా మందలించారు. అయితే హరిణి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పైగా భర్తకు విడాకులు ఇచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.

విడాకుల పేరుతో ఊరికి రప్పించి

హరిణి తమ మాట వినకుండా ప్రియుడితో వెళ్తే తమ పరువు పోతుందని భావించిన కుటుంబ సభ్యులు, ఆమెను ఎలాగైనా చంపేయాలని స్కెచ్ వేశారు. నీ ఇష్టప్రకారమే విడాకులు ఇస్తామని నమ్మబలికారు. పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని నమ్మించి హరిణిని మే 31న ఊరికి రప్పించారు.

జూన్ 1వ తేదీ రాత్రి 11:15 గంటల సమయంలో హరిణి మంచంపై నిద్రిస్తుండగా తల్లి విజయకుమారి హరిణి కాళ్లను గట్టిగా పట్టుకుంది. తాత బలుసాకు ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి హరిణిని ప్రాణాలను తీశాడు. శరీరంపై ఉన్న గాయాలు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎవరు అడిగినా.. గుండెపోటు అని చెప్పుకొచ్చారు.

పోలీసులకు దొరికిన సెల్ఫీ వీడియో

ఆధారాలు లేకుండా శవాన్ని దహనం చేసినప్పటికీ, యువతి ఆకస్మిక మృతిపై గ్రామంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ఫిర్యాదుతో టెక్కలి పోలీసులు రంగంలోకి దిగారు. అయితే దహన సంస్కారాలు అయిపోవడంతో ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

ఈ క్రమంలో హరిణి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తన ప్రియుడికి పంపిన ఒక సెల్ఫీ వీడియో కేసును మలుపు తిప్పింది. ఆ వీడియోలో.. "మా అమ్మ పిలవడం వల్లే నేను ఊరికి వెళ్తున్నాను. కానీ నాకు అక్కడ ప్రాణహాని ఉంది" అని హరిణి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆధారంతో పోలీసులు కుటుంబ సభ్యులను గట్టిగా విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నారు.

తప్పించుకునేందుకు భర్త హైడ్రామా

హరిణి భర్త దంతేశ్వరరావు సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. హత్య జరిగిన సమయంలో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అతడు టెక్కలిలోని ఒక సినిమా థియేటర్‌కు వెళ్లాడు. కానీ ఇదంతా ముందస్తు ప్లాన్ అని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో తల్లి విజయకుమారిని ఏ 1గా, తాత బలుసాకును ఏ 2గా, భర్త దంతేశ్వరరావును ఏ 3గా చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More