...
...
Next Story

జాతీయ సరస్‌ మేళా-2026 ప్రారంభం.. చీర కొని డిజిటల్‌ చెల్లింపులు చేసిన రాష్ట్రపతి

SARAS Mela 2026 : విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

Published on: Oct 15, 2026, 13:56:42 IST
Advertisement

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ సరస్ మేళా–2026 వేడుకలు విజయవాడ నగరం వేదికగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పున్నమి ఘాట్ ప్రాంగణంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం ఈ జాతీయ మేళాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఘనంగా ప్రారంభించారు.

జాతీయ సరస్ మేళా 2026 ప్రారంభం
జాతీయ సరస్ మేళా 2026 ప్రారంభం

ఈ నెల 15 నుండి అక్టోబర్ 31 వరకు దాదాపు 14 రోజుల పాటు ఈ మేళా ప్రజలకు అందుబాటులో ఉండనుంది. మేళా ప్రారంభం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాలు(SHG) ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించారు. గ్రామీణ చేతివృత్తులు, చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, ఇతర కళారూపాలను ఆమె ప్రత్యేకంగా పరిశీలించారు.

ఉత్పత్తుల తయారీ విధానంపై డ్వాక్రా మహిళలతో ముచ్చటించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా ఒక స్టాల్‌లో చీరను కొనుగోలు చేసిన రాష్ట్రపతి, స్వయంగా డిజిటల్ విధానంలో చెల్లింపు చేశారు. మహిళల ప్రతిభ, నైపుణ్యాలు, వారి వ్యాపార దృక్పథాన్ని రాష్ట్రపతి అభినందించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి ఆమె భోజనం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం స్వయం ఏపీ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నాణ్యమైన ప్యాకింగ్, ఆన్‌లైన్ ఇ-కామర్స్ అనుసంధానం, విశాఖపట్నం, విజయవాడలలో ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా డ్వాక్రా ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

మహిళల అభ్యున్నతిపై దృష్టి కేంద్రీకరించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధి కల్పనను దాటి, లాభదాయకమైన, స్థిరమైన, విస్తరించదగిన మహిళా పారిశ్రామిక సంస్థలను నిర్మించడం మీద దృష్టి పెట్టాలని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ఆర్థిక వసతులు, ఆధునిక సాంకేతికత, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలన్నారు. నమ్మకమైన మార్కెట్ అనుసంధానాలు కల్పించడం ద్వారా వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి విస్తృత మార్కెట్లలో పోటీ పడేలా మద్దతునివ్వాలని గవర్నర్ తెలిపారు.

సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... విజయవాడలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో, కృష్ణమ్మ చెంతన ఈ జాతీయ సరస్ మేళాను ప్రారంభించేందుకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 'సాధారణ పేద కుటుంబంలో జన్మించి, ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించి అనేక కష్టాలను ఎదుర్కొంటూ నేడు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అధిష్టించిన ద్రౌపది ముర్ము జీవితం సమాజానికి గొప్ప ఆదర్శం. మహిళ తలుచుకుంటే ఏ ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలదని ఆమె నిరూపించారు.' చంద్రబాబు నాయుడు అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks