రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా గ్యాస్ కొరత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్… సీఎం చంద్రబాబుకి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎల్పీజీ సహా వివిధ ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ను సభ్యులుగా నియమించారు. ఆర్టీజీఎస్ నుంచి ఆయా శాఖల అధికారుల నిరంతరం మానిటర్ చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
నిఘా పెట్టండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు
సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… పాఠశాలలు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా ఎల్పీజీ సరఫరా జరగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎక్కడా కొరత లేదన్నారు. యుద్ధ ప్రభావంతో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణం చక్కదిద్దేదేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను జిల్లా కలెక్టర్లు చూడాలని దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోనేలా అప్రమత్తంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా నిఘా పెట్టాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 1.61 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సహా వివిధ కంపెనీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది. రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ ఉంటుంది. వివిధ గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం 21505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు.