...
...
Next Story

ఆలయ ఆచార వ్యవహారాల్లో అధికారులు వేలు పెట్టొద్దు.. దేవాదాయ శాఖ మంత్రి క్లారిటీ

ఆలయాల్లో సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. భక్తులు భద్రత విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం అందించడంలో రాజిపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Published on: Feb 10, 2026, 18:43:00 IST
Advertisement

రానున్న మహా శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం సహా వివిధ శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ, వసతులు, ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలతో పాటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ వంటి ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రి ఆనం మాట్లాడారు. దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై సూచనలు చేశారు.

అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు
అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు

మహా శివరాత్రి నాటికి అన్ని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జిల్లా కలెక్టర్లు పూర్తి సమన్వయంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు, వసతులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.

'భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా చూడాలి. వసతి సదుపాయాలు సకాలంలో లభించేలా కార్యచరణ అమలు చేయాలి. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయాలకు వచ్చే భక్తులను అగౌరవపరిచేలా లేదా ఇబ్బందులకు గురిచేసేలా ఎవరూ వ్యవహరించకూడదు.' అని మంత్రి ఆనం అన్నారు.

రోజురోజుకూ ఆలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, మహా శివరాత్రి వంటి కీలక సందర్భాల్లో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో దేవాదాయ శాఖ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భక్తులకు గౌరవ మర్యాదల విషయంలో, సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాట విషయంలో రాజిపడే ప్రసక్తి లేదని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రద్దీ నియంత్రణకు స్పష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని చెప్పారు. ప్రసాదం పంపిణీ ఎక్కడా ఆలస్యం కాకుండా సక్రమంగా జరగాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టి ఆలయాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహా శివరాత్రి ఏర్పాట్లలో టెంపుల్ ఆఫీసర్లు, ఫెస్టివల్ ఆఫీసర్లు వీఐపీలతో పాటు సామాన్య భక్తులకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి కేటాయించిన సమయాల్లో దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆనం సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe