TTD : తిరుమల ఆలయ తరహాలో టీటీడీలోని అన్ని ఆలయాలలో కైంకర్యాలు

అర్చక శిక్షణా తరగతులను టీటీడీ ఇంచార్జ్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. శాస్త్రం, సంప్రదాయాలకు సాంకేతికతను జోడించి వారసత్వ సంపదను కాపాడాలని పిలుపునిచ్చారు.

Published on: Feb 4, 2026, 15:23:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని టీటీడీ ఇంఛార్జ్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. వేలాది సంవత్సరాలుగా మన పూర్వికులు అందించిన శాస్త్రం, సంప్రదాయాలు, సనాతన వారసత్వ సంపదకు సాంకేతికతను జోడించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన అర్చక, పరిచారిక, వేదపారాయణందారుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

అర్చక శిక్షణా తరగతులు ప్రారంభం
అర్చక శిక్షణా తరగతులు ప్రారంభం

ఈ సందర్భంగా ఇంఛార్జి ఈవో మాట్లాడుతూ టీటీడీ పరిధిలోని వివిధ ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న 35 మంది అర్చకులు, పరిచారకులు, 15 మంది వేద పారాయణదారులకు మూడు రోజులపాటు పునఃశ్చరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులు నిత్యం నిర్వహించే కైంకర్యాలను మరింత శుద్ధిగా, నియమబద్ధంగా నిర్వహించేందుకు ఈ పునఃశ్చరణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త అంశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఇవి దోహదపడతాయని వెంకయ్య చౌదరి అన్నారు. శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వంటి మహనీయులు కాపాడుతూ వచ్చిన సనాతన సంప్రదాయాన్ని భక్తులకు, సమాజానికి చేరవేయడంలో ఈ శిక్షణా తరగతులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

'ఈ తరగతులలో ఆగమ పరిచయం, ఆగమాలు, వైఖాసనం, నిత్య పూజ విధానం, పంచసూక్తాలు, సంధ్యావందనం, గోత్రప్రవరలు, అగ్ని ప్రతిష్టాపన, నవ్యశేషాంశములు, అష్టోత్తర, ఆశీర్వచన మంత్రాలు, ఉచ్ఛరణ సంస్కృత పరిజ్ఞానం, కల్యాణోత్సవంలో లాజహోమ ప్రధాన హోమాలు, తిరుమల శ్రీవారి ఆలయ ఉత్సవాలు, సంప్రదాయాలు, బ్రహ్మోత్సవం, అర్చకుల లక్షణాలు, విధులు, పవిత్రోత్సవం ప్రాముఖ్యత, గృహ అర్చన, బింబ ప్రతిష్ట, వైశిష్ట్యం, జ్యోతిష్య శాస్త్రం, నిత్యార్చన, శిక్షణ నిర్ధారణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నాం. శిక్షణ అనంతరం శిక్షణ తీసుకున్న వారు ఏం నేర్చుకున్నారు, ఇంకా ఏం నేర్చుకోవాలో తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ సేకరించి తదనుగుణంగా మాడ్యూల్స్ రూపొందించాలి.' అని ఇంఛార్జ్ ఈవో అన్నారు.

అనంతరం వేద విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, అర్చకులు, పరిచారకులు, వేద పండితులకు శిక్షణా కార్యక్రమాలు తప్పనిసరిగా నిరంతరం నిర్వహించాలన్నారు. ఈ శిక్షణల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభించడమే కాకుండా, భిన్నమైన అభిప్రాయాల పరస్పర మార్పిడి ద్వారా నూతన ఆలోచనలు వెలుగులోకి వస్తాయని వివరించారు.

తర్వాత శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్త బ్రహ్మోత్సవానుక్రమణికా పుస్తకాన్ని టీటీడీ ఇంఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి ఆవిష్కరించారు. అనంతరం నిత్య జీవితంలో వేదాల విశిష్టతను, యోగా ప్రాముఖ్యత తెల్పేలా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించారు. తిరుమల ఆలయ తరహాలో టీటీడీలోని అన్ని ఆలయాలలో కైంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా టీటీడీ ఆధ్వర్యంలోని 61 ఆలయాలలో పనిచేసే అర్చక, పరిచారిక, వేదపారాయణందారులకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More