...
...
Next Story

ఈనెల 17న శ్రీవారి ఆలయంలో 'ఆణివార ఆస్థానం' - సాయంత్రం పుష్ప పల్లకీపై ఊరేగింపు, ఈ సేవలన్నీ రద్దు

Tirumala Anivara Asthanam 2026 : తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు సాయంత్రం మలయప్పస్వామి వారు పుష్ప పల్లకిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Published on: Jul 6, 2026, 06:56:55 IST
Advertisement

Tirumala Anivara Asthanam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే అతి ముఖ్యమైన కొలువుల్లో ఈ ఆణివార ఆస్థానం అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు.

చారిత్రక నేపథ్యం……

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో, కర్కాటక సంక్రాంతి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే, సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున ఈ కొలువును నిర్వహించడం వల్ల దీనికి 'ఆణివార ఆస్థానం' అనే పేరు వచ్చింది. దీనికి ఒక ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది.

పూర్వం మహంతులు శ్రీవారి దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు ఇదే కావడంతో, నాటి నుండి టీటీడీ వారి వార్షిక ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర లెక్కల పుస్తకాలను కొత్తగా ప్రారంభించేవారు. అయితే టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత ఈ వార్షిక బడ్జెట్ కాలవ్యవధిని మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు. అయినప్పటికీ, పూర్వపు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

  • ఆణివార ఆస్థానం పర్వదినం రోజున ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందు భాగంలో ఉన్న ఘంటా మండపంలో ప్రత్యేక కొలువు జరుగుతుంది.
  • ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి వారు సర్వభూపాల వాహనంపై గరుత్మంతునికి అభిముఖంగా వేంచేపు చేస్తారు.
  • స్వామివారితో పాటు ఆయన సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనుల వారు మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా కొలువుతీరుతారు.
  • ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలో వేంచేసి ఉన్న మూలవిరాట్టుకు కూడా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను సమర్పిస్తారు.

జీయ్యంగార్ల పట్టువస్త్రాల సమర్పణ….

అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణను స్వీకరిస్తారు. ఆ తర్వాత "నిత్యైశ్వర్యోభవ" అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఈ క్రతువు ముగిసిన వెంటనే అర్చకులు తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామివారికి, ఆపై టీటీడీ కార్యనిర్వహణాధికారికి (EO) లచ్చన అనే తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం, ఆ తాళపు చెవి గుత్తిని తిరిగి శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.

పుష్ప పల్లకీ సేవ…

ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై కొలువుతీరుతారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు.

ఆర్జిత సేవలు రద్దు:

ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలు జరగనున్న కారణంగా జూలై 17వ తేదీన నిర్వహించాల్సిన పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జరగవని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe