తిరుపతికి ప్రధాని నరేంద్ర మోదీ.. డిసెంబర్‌లో మూడు రోజులు ఇక్కడే.. పూర్తి షెడ్యూల్ ఇదే!

PM Modi Tirupati Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు జరిగే 61వ అఖిల భారత పోలీస్ ఉన్నతాధికారుల సదస్సులో పాల్గొంటారు.

Published on: Nov 29, 2026, 14:09:08 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తిరుపతి మరో ప్రతిష్టాత్మక జాతీయ కార్యక్రమానికి వేదిక కాబోతోంది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సు డిసెంబర్ 4 నుండి 6 వరకు తిరుపతి జిల్లాలో జరగనుంది. ఈ ఉన్నత స్థాయి సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఉంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఏర్పేడులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER - ఐసర్) ప్రాంగణం ఈ కీలక భేటీకి ఆతిథ్యమిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ఢోబాల్‌లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర సాయుధ బలగాల అధిపతులు సహా సుమారు 200 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ మూడు రోజుల పాటు లోతైన చర్చలు జరగనున్నాయి.

ముఖ్యంగా దేశ భద్రతకు పెను సవాలుగా మారుతున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద ముప్పు, వ్యవస్థీకృత నేరాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక వ్యూహాలను రచించనున్నారు. వీటితో పాటు పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.

మోదీ తిరుపతి టూర్ షెడ్యూల్

డిసెంబర్ 4న ప్రధాని మోదీ రాత్రి 8:30 గంటలకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధానికి ఘనస్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి ఆయన నేరుగా ఏర్పేడులోని ఐసర్ కేంద్రానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

డిసెంబర్ 5న ఉదయం 6 గంటలకు ప్రధాని మోదీ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 8:15 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సదస్సులో జరిగే వివిధ చర్చల్లో పాల్గొంటారు.

డిసెంబర్ 6న రెండో రోజు కూడా ఉదయం 6 గంటలకు యోగా సెషన్‌తో దినచర్య ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఐసర్‌లో జరిగే ముగింపు సమావేశాల్లో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం ప్రధాని తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా దేశంలోని ఉన్నత భద్రతాధికారులు ఒకే చోట మూడు రోజుల పాటు ఉండనుండటంతో తిరుపతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తూ విమానాశ్రయం నుండి ఏర్పేడు ఐసర్ వరకు, అలాగే తిరుమల మార్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, రవాణా, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.