PM Modi Telangana Visit : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు - మే 10న రాష్ట్రానికి రాక, సికింద్రాబాద్ లో భారీ సభ
PM Modi Telangana Visit : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
PM Modi Telangana Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక మైలురాయిగా నిలిచే భారీ ప్రాజెక్టులకు ఆయన ఈ సందర్భంగా అంకురార్పణ చేయనున్నారు.

పలు పనులకు శ్రీకారం….
మొత్తం రూ.7,823 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో కొన్నింటికి శంకుస్థాపన చేయటంతో పాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ పారిశ్రామిక నగరం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు ఇది ప్రధాన కేంద్రంగా మారబోతోంది.
గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఆ పరంపరను కొనసాగిస్తూనే….. తాజా పర్యటనలో రూ.7,823 కోట్ల నిధులతో పారిశ్రామిక, రవాణా రంగాలను బలోపేతం చేసే దిశగా అడుగులు పడనున్నాయి.
"మే 10వ తేదీన తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ… ఇక్కడ భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఆయన రాష్ట్రానికి రావడం పట్ల ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది." అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ. 85 వేల కోట్ల రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని…. కాజీపేట రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు.సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు.
భారీ సభ…
మే 10వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ సభను తలపెట్టింది. “జనాగ్రహ సభ”పేరుతో నిర్వహించబోయే ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక నగరం ప్రారంభోత్సవంతో పాటు అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

