ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఈ 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు - ఈదురుగాలుల హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరోవైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో ఇవాళ, రేపు (సెప్టెంబర్ 4, 5) మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వివరాల ప్రకారం… వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అకస్మాత్తుగా వీచే గాలులు, పిడుగుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.
పిడుగులు పడే ముప్పు ఉన్నందున వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, కూలీలు, పశువుల కాపరులు తీవ్ర అప్రమత్తత పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం వచ్చే సూచనలు కనిపించగానే పొలాల్లోని చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని స్పష్టం చేసింది. సురక్షితమైన భవనాలు లేదా పాకల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో పెరగనున్న ఎండలు
ఒకవైపు తేలికపాటి వర్ష సూచన ఉన్నప్పటికీ… ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉక్కపోత, వేడిగాలుల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ వెదర్ రిపోర్ట్ :
మరోవైపు తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి…. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

