22ఏ జాబితా భూముల తొలగింపు సరళతరం.., అందుకే ఆ భూములు నిషేధిత జాబితాలో..

22ఏ జాబితా నుండి భూముల తొలగింపు మరింత సరళతరం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. పేదలకు లబ్ధి చేకూరేలా నిషేధిత జాబితా భూములపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Published on: Feb 19, 2026, 12:11:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

22ఏ నిషేధిత జాబితా నుండి భూములను తొలగించే ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భూ ఆక్రమణ, 22ఏ జాబితా నుండి తొలగింపు అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సమాధానమిచ్చారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్
మంత్రి అనగాని సత్యప్రసాద్

22ఏ నిషేధిత జాబితా నుండి ప్రైవేట్ భూములను తొలగించేందుకు ఇప్పటికే మెమోను జారీ చేశామని, ఇందులో ఐదు రకాల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించే అవకాశాన్ని కల్పించామని చెప్పారు. ఈ సందర్భంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలుగజేసుకొని 22ఏ నిషేధిత భూముల సమస్య రాష్ట్రమంతా ఉందని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా మంచి మార్గదర్శకాలు కూడా ఇచ్చిందని, ఇవి అమలయ్యేలా చూడాలని మంత్రి అనగానిని కోరారు.

దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ 22ఏ నిషేధిత జాబితా నుండి ప్రైవేట్ భూముల తొలగింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తామన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తాను, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఒక టీమ్ గా 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తున్నామని చెప్పారు. పేదలకు లబ్ది జరిగేలా, సామాన్యులు నష్టపోకుండా ఉండేలా 22ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు మార్గనిర్దేశం చేశారన్నారు. తాము ఆ దిశగా పని చేస్తున్నామని చెప్పారు.

జిల్లా స్థాయిలో 22ఏ భూముల తొలగింపునకు ఇచ్చిన ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక డ్రైవ్ చేపడతారని చెప్పారు మంత్రి అనగాని. తిరువూరు మండలంలోని రామన్న పాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 22లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రశ్న అడగగా ఆ భూములకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయని, కోర్టు తీర్పు వచ్చేంతవరకు ఎదురు చూడాల్సి ఉందన్నారు.

అలాగే విశాఖలో మాజీ సైనికోద్యోగులకు అసైన్డ్ చేసిన భూముల అమ్మకాలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూములను పదేళ్ల తర్వాత వారు గానీ, వారి వారసులు గానీ అమ్ముకోవచ్చన్నారు. అయితే అలా కేటాయించిన భూముల్లో నీటి వనరులు ఉంటే సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల రీత్యా, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే వాటిని నిషేధిత జాబితాలో పెట్టినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

22ఏ జాబితా నుంచి 5 రకాల భూములు తొలగింపు వార్త కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More