సౌజన్యను మతం మారాలని సాధిక్ ఒత్తిడి చేశాడు : కాకినాడ ఎస్పీ

ఏఈ నూకరాజు కుటుంబం సూసైడ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ చెప్పారు. రైఫిల్ షుటింగ్ కోచ్ సాధిక్ ఖాన్ వేధింపులతోనే ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

Published on: Aug 24, 2026, 18:06:10 IST
By , Kakinada
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాకినాడ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసు విచారణలో కీలక పురోగతి లభించింది. ఈ దారుణ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు, రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు
ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు

ఈ విషాద ఘటనలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్స్ రెడ్డి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో చిన్నారి రియాన్స్ రెడ్డి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, నూకరాజు, మీనా, సౌజన్య నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మొదట ఈ ఘటనపై రాజమహేంద్రవరంలో కేసు నమోదవ్వగా, ఘటన వెనక ఉన్న అసలు కారణాలు విచారణలో బయటపడ్డాయి.

పోలీసులు జరిపిన తనిఖీల్లో రెండు వేర్వేరు సూసైడ్ నోట్‌లు లభించాయి. ఒక లేఖ నూకరాజు వద్ద లభించగా, మరొకటి ఆయన కుమార్తె సౌజన్యకు చెందిన స్కూటీలో దొరికింది. సాధిక్ ఖాన్ తమను తీవ్రంగా మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడని, ఆస్తిపై కన్నువేసి బ్లాక్‌మెయిల్ చేశాడని లేఖల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, సౌజన్యపై బలవంతంగా మతం మారాలని సాధిక్ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు లేఖల ద్వారా స్పష్టమైంది. బాధితురాలు సౌజన్య మామ భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్పీ తెలిపారు.

సామూహిక ఆత్మహత్యల అనంతరం నిందితుడు సాధిక్ ఖాన్ పరారయ్యాడు. అతడి కోసం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పోలీసులతో కూడిన 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఐదు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మేరఠ్‌లో సాధిక్ ఆచూకీ కనుగొన్నారు. అక్కడ తన స్నేహితులకు తన ఫోన్, డబ్బు పోయాయని మాయమాటలు చెప్పి తలదాచుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మేరఠ్ స్థానిక కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై అతడిని కాకినాడకు తీసుకువచ్చారు.

సాధిక్ ఖాన్‌పై హత్య, బలవంతపు మతమార్పిడి, ఆత్మహత్యకు ప్రేరేపించిన తీవ్రమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి, తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. కస్టడీలో విచారిస్తే వేధింపులకు సంబంధించిన మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు, బెదిరింపులు ఎదురైనప్పుడు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా పోలీసులను ఆశ్రయిస్తే తగిన రక్షణ కల్పిస్తామని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More