Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం(ఇవాళ) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు దివ్యమైన సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. గంభీరమైన సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తజనం పరవశించిపోయారు. తిరుమాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో, హరినామ సంకీర్తనలతో మారుమోగిపోయాయి.
భక్తి పారవశ్యంలో వాహనసేవ…..

మాడ వీధుల్లో సాగిన ఈ వాహనసేవ భక్తులకు కన్నులపండువగా నిలిచింది. ఊరేగింపు ముందుగా గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, ఉత్సాహంగా సాగిన కోలాటాలు, శ్రీవైష్ణవ జీయంగార్ల వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత వేడుకగా సాగింది. తిరుమల పురవీధులన్నీ భక్తి చైతన్యంతో, ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయాయి.
సనాతన ధర్మంలో సింహం ధైర్యం, పరాక్రమం, తేజస్సు, గంభీరతలకు ప్రతీకగా నిలుస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ శ్రీ మలయప్పస్వామివారు ఈ రాజసంతో కూడిన సింహ వాహనాన్ని అధిరోహించారు. యోగ నరసింహస్వామి అలంకారంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు నిర్భయత్వం, ఆత్మవిశ్వాసం చేకూరడమే కాకుండా ధర్మమార్గంలో నడిచే సద్బుద్ధి లభిస్తుందని నమ్ముతారు. భగవంతుని అనుగ్రహం ఉంటే ధర్మమే అంతిమంగా విజయాన్ని సాధిస్తుందనే ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ వాహనసేవ భక్తకోటికి స్పష్టం చేసింది.
ఈ దివ్య వాహనసేవలో తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జానకిదేవి, రంగశ్రీ, శాంత రామ్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.