తిరుమల : వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర - గరుడ వాహనంపై భక్తులకు దర్శనం

 వైభవంగా తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర జరిగింది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

Published on: Feb 12, 2026 7:16 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి వైభవంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు.

శ్రీవారి లక్ష్మీ కాసుల హారం
శ్రీవారి లక్ష్మీ కాసుల హారం

గరుడ సేవ వేళ అలంకరణ…

ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ…. టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవ రోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు.

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ సందర్భంగా టీటీడీ నుంచి దాదాపు రూ. 6.40 కోట్లు విలువగల 4 కేజీల డైమండ్ మోపుగల 6 పేటల బంగారు యజ్ఞోపవీతము స్వామి వారికి అందించినట్లు తెలిపారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పెష్కార్ శ్రీ రామకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామ స్వామి, రామచంద్ర పుష్కరిణి మీదుగా మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

గరుడసేవ - భారీ ఏర్పాట్లు:

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్‌ దీపాలంకరణలు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్‌, పోలీస్‌ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్‌తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More