జిల్లాల పునర్విభనపై కొనసాగుతున్న కసరత్తు - తెరపైకి మార్పుచేర్పులు

ఏపీ జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పుచేర్పులు ఉండనున్నాయి. గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపనున్నారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు ఉండదు.

Published on: Dec 28, 2025, 05:15:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పుచేర్పులతో ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు.

ఏపీలో జిల్లాల పునర్విభజన
ఏపీలో జిల్లాల పునర్విభజన

గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా... దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా... వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలోకే తిరిగి 5 మండలాలు…

గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…. అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు.

మరోవైపు…. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్‌ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటుకానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు...ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఈ ప్రాంతాలు యథావిధిగానే…!

• శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చడం.

• అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్‌కు మార్చడం.

• కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌కు మార్చడం

• అద్దంకి రెవెన్యూ డివిజన్‌లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పు చేయడం.

• కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు... ప్రకాశం జిల్లాలో విలీనం.

• కందుకూరు డివిజన్‌లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చడంతో పాటు... కందుకూరు డివిజన్‌లోని మిగిలిన రెండు మండలాలు అయిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్‌లోకి మార్పు.

• పలమనేరు డివిజన్‌లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్‌కు మార్పు.

• చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు మార్చడం.

• చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌కు మార్పు.

• శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.

• కదిరి రెవెన్యూ డివిజన్‌లోని ఆమదగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో విలీనం.

పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మార్పుచేర్పుల తర్వాత ఈ డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More