కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి లక్కీ డిప్ కాకుండా నేరుగా బుక్ చేసుకునే ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఇవాళ(జూలై 21) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా, వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
- తిరుమల ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం టోకెన్ల కోటాను ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. దీనితో పాటు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
- వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు (వ్యాధులు) ఉన్నవారు తిరుమల శ్రీవారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా కల్పించే ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు.
- రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఆ తర్వాత… తిరుమల మరియు తిరుపతిలలో భక్తులు బస చేయడానికి అవసరమైన వసతి గదుల (రూమ్స్) కోటాను అదే రోజు (ఈనెల 24) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
భక్తులు నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని…. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.