...
...
Next Story

శ్రీవారి బ్రహ్మోత్సవాలు : చంద్రప్రభ వాహ‌నంపై మురళీకృష్ణుడి అలంకారంలో క‌టాక్షించిన స్వామివారు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రాత్రి వర్షంలోనూ చంద్రప్రభ వాహనంపై స్వామివారు అభయం ఇచ్చారు.

Published on: Sep 21, 2026, 22:17:09 IST
Advertisement

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు సోమవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై మురళీకృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. వాహన సేవ సమయంలో వర్షం పడటంతో ఘటాటోపంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

చంద్రప్రభ వాహనంపై స్వామివారు
చంద్రప్రభ వాహనంపై స్వామివారు

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. ఈ వాహ‌న సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో ముర‌ళికృష్ణ, పలువురు బోర్డు సభ్యులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా స్నపన తిరుమంజనం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు తదితరాలతో రూపొందించిన విశేష మాలల మధ్య స్వామి, అమ్మవార్లు దివ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అర్చకస్వాములు వేదమంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.

ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు. స్నపన తిరుమంజనం సందర్భంగా టీటీడీ వేద పారాయణదారులు ఉపనిషత్ మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను భక్తిభావంతో పారాయణం చేశారు.

అభిషేకానంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు వివిధ దివ్య పాశురాలను పఠించారు. ఈ వేడుకలో భాగంగా తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు, పసుపు రేకులు, రోజాలు, బటన్ చామంతి మాలలతో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. సుగంధ పరిమళాలు, పుష్పాల సౌరభం, వేదఘోషలు, భక్తిభావంతో రంగనాయకుల మండపం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks