...
...
Next Story

శ్రీవారి భక్తులకు అలర్ట్.. విరాళాలు ఇచ్చే సమయంలో చూసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి!

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. విరాళాలు ఇచ్చే సమయంలో సరిగా చూసుకోవాలని తెలిపింది. ఎందుకంటే విరాళాల పేరుతో భక్తులను మోసం చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

Updated on: Nov 20, 2025, 14:09:09 IST
Advertisement

విరాళాల విషయంలో కచ్చితంగా సరైన సమాచారం తెలుకోవాలని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు విజ్ఞప్తి చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

Global Hindu Heritage Foundation, savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని, మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.

ఈ విధమైన సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల విశ్వాసం నిలబెట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

కల్పవృక్ష వాహనంపై అమ్మవారు

మరోవైపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగ జరుగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ, చిరుజల్లుల మధ్య వాహనసేవ కోలాహలంగా జరిగింది.

పాలకడలిని అమృతం కోసం మథించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షమని నమ్మకం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వ జన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుందని టీటీడీ ప్రకటనలో తెలిపింది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ అని పేర్కొంది. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడని, కోర్కెలను తీర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ భక్తులకు సమస్యలను తొలగించే పరిపూర్ణశక్తి అని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks