...
...
Next Story

Tirumala : రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన - క్లారిటీ ఇదే

శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై వస్తున్న సందేహాలకు టీటీడీ స్పష్టతనిచ్చింది. భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ నెలకొన్నట్లు పేర్కొంది.

Published on: Sep 26, 2026, 17:51:10 IST
Advertisement

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న వివిధ రకాల సందేహాలు, సోషల్ మీడియా ప్రచారాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది.

రూ.300 దర్శనం టికెట్లు
రూ.300 దర్శనం టికెట్లు

భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి వెబ్‌సైట్‌ను ఆశ్రయించినప్పుడు తలెత్తే తీవ్రమైన డిమాండ్‌ను తట్టుకునేందుకు అత్యాధునిక 'గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్' ను ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. దీనికి తోడు లోడ్ బ్యాలెన్సింగ్ , ఆటో స్కేలింగ్ , డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, హారిజాంటల్ స్కేలింగ్ వంటి అత్యాధునిక డిజిటల్ వ్యవస్థలను అమలు చేస్తున్నామని వెల్లడించింది. అధిక డిమాండ్ సమయంలో అప్లికేషన్లు, ఏపీఐ, గేట్‌వే సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అనేక ‘రెప్లికాస్’ ద్వారా వ్యవస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

వార్ రూమ్ ఏర్పాటు.. నిరంతర పర్యవేక్షణ

టికెట్ల కోటా విడుదల చేసే సమయాల్లో ప్రత్యేకంగా 'టెక్నికల్ వార్ రూమ్' ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ప్రతినిధులు వివరించారు. అప్లికేషన్ పెర్ఫార్మెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హెల్త్, ట్రాన్సాక్షన్లు, సైబర్ సెక్యూరిటీ అంశాలను నిపుణులైన సాంకేతిక బృందాలు క్షణక్షణం పర్యవేక్షిస్తాయి. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే తక్షణమే పరిష్కరించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.

రూ.300 టికెట్ల కోటా విడుదల కాగానే నిమిషాల వ్యవధిలోనే ఎందుకు పూర్తవుతాయో టీటీడీ గణాంకాలతో సహా వివరించింది. ఆన్‌లైన్ బుకింగ్ సమయాల్లో సుమారు 6 లక్షల మంది యూజర్లు ఒకేసారి లాగిన్ అయి ప్రయత్నిస్తుంటారు. ఒక్కో యూజర్ తమ కుటుంబంలో సగటున నలుగురి కోసం టికెట్లు బుక్ చేసేందుకు యత్నిస్తే, ఏకంగా 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడుతుంది. అయితే టీటీడీ విడుదల చేసే కోటా నెలకు కేవలం 2.69 లక్షల టికెట్లు మాత్రమే. అంటే అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఈ కారణం వల్ల వేలాది మంది ఒక్కసారిగా ఒకే స్లాట్ కోసం యత్నించినప్పుడు సెకన్ల వ్యవధిలోనే కోటా పూర్తవుతుంది.

భారీ ట్రాఫిక్ వచ్చినప్పుడు మెయిన్ సర్వర్లు లేదా బ్యాకెండ్ సిస్టమ్‌లు క్రాష్ కాకుండా రక్షించేందుకు 'వర్చువల్ క్యూ' విధానాన్ని వాడుతున్నారు. వర్చువల్ క్యూ అనేది భక్తులకు టికెట్లు నిరాకరించేందుకు పెట్టినది కాదని, అది కేవలం నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాంకేతిక సాధనం మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే భక్తులకు స్క్రీన్‌పై 'Slot Unavailable' అని సందేశం వస్తే, టికెట్లు వేగంగా పూర్తయ్యాయని అర్థం తప్ప, దాన్ని సిస్టమ్ వైఫల్యంగా భావించకూడదని పేర్కొంది.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయాల దర్శనం, సేవా కోటాలను కూడా ఇదే ఆన్‌లైన్ విధానం ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే అక్కడ ఒకేసారి ఏర్పడే రద్దీ లేదా డిమాండ్ తక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రక్రియ అత్యంత వేగంగా, సజావుగా ముగుస్తోందని టీటీడీ ఉదాహరణగా చూపింది.

భక్తుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆన్‌లైన్ బుకింగ్, డేటాబేస్ పెర్ఫార్మెన్స్, హై-లోడ్ హ్యాండ్లింగ్, సెక్యూరిటీ, యాంటీ-బోట్ మెకానిజమ్స్ మరియు పేమెంట్ వ్యవస్థలను నిరంతరం నవీకరిస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ఆన్‌లైన్ బుకింగ్ సేవలను సురక్షితంగా, పారదర్శకంగా అందించేందుకు తగిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks