...
...
Next Story

Tirumala Temple : తుపానుతో వర్షాలు.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Tirumala Temple : తుపాను నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలన్నారు.

Published on: Nov 2, 2026, 21:59:11 IST
Advertisement

తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్నప్రసాదాల పంపిణీకి అంతరాయం లేకుండా, క్యూలైన్లు బయటకు రాకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ మేరకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

తిరుమల శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి దర్శనం

ఈ సందర్భంగా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలని, సాధ్యమైనంత వరకు క్యూ లైన్లు వెలుపలకు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

వర్షాల కారణంగా అన్నప్రసాదాల పంపిణీకి ఎక్కడా అంతరాయం కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలని అదనపు ఈవో సూచించారు. భక్తులు వసతి గదులు, కంపార్ట్‌మెంట్లలో సురక్షితంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని విద్యుత్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో వర్షాల కారణంగా చిన్న చిన్న రాళ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని, డౌన్ ఘాట్, అప్ ఘాట్ రోడ్లలో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని వెంకయ్య చౌదరి సూచించారు.

వర్షాల సమయంలో భక్తులు నడిచేటప్పుడు జారిపడి గాయపడే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి, అవసరమైన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. భక్తులందరూ సురక్షితంగా, సులభంగా శ్రీవారి దర్శనం చేసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో ఆదేశించారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు నవంబరు 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు మత్స్యగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు ఉదయం 9.30 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహిస్తారు.

మొదటిరోజైన నవంబరు 5న ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. రెండో రోజైన నవంబరు 6న మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. చివరిరోజైన నవంబరు 7న రాత్రి 8.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

ఉత్సవాల్లో భాగంగా నవంబరు 5, 7 తేదీల్లో ఉదయం 11 గంటలకు, నవంబరు 6న ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. నవంబరు 6న సాయంత్రం 5 గంటలకు స్వామివారు, అమ్మవార్ల వీధి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks