రాష్ట్రంలో 2027 నాటి వరకు 73 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి
ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు రైల్ కనెక్టివిటీ మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు అన్నారు. పుష్కరాల నాటికి రాజమండ్రి, విజయవాడ స్టేషన్ల ఆధునీకరణ పూర్తి చేయాలని చెప్పారు.
రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని... రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్‌గా నిలిపేలా చూడాలని చంద్రబాబు నాయుడు రైల్వే శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా ఏపీలో రైల్వే కనెక్టివిటీ పెరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఏపీ పోర్టులతో కనెక్టివిటీ
పొరుగు రాష్ట్రాల్లోని హింటర్ ల్యాండ్‌ను ఏపీ పోర్టులు అన్నింటితో అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణా, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు రైల్ రవాణాకు నెలకొన్న అవకాశాలనూ చర్చించారు. రాష్ట్రంలో ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయని... మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో ప్రధాన లైన్లను త్వరితగతిన కనెక్టు చేయాలని సీఎం అన్నారు. తిరుపతి-రేణిగుంట ప్రాంతం కూడా పారిశ్రామిక హబ్‌గా తయారవుతోందని, దీనిని కూడా ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానిస్తే పారిశ్రామిక ఉత్పత్తులను వేగంగా, తక్కువ వ్యయానికే రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు.
4 వరుసల రైల్వే లైన్
ఇచ్ఛాపురం-తడ మధ్య 4 వరుసల రైల్వే లైన్లు నిర్మించేందుకు కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే 3 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చేలా డీపీఆర్ తయారు చేయాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మార్గంలో ఎక్కడ 2 లైన్లు, ఎక్కడ 3 లైన్లు ఉన్నాయనే దానిపై అధ్యయనం చేసి 4 వరుసల లైన్ నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ, భూసేకరణ... తదితర ప్రక్రియలకు రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డిప్యూటీ తహసిల్దార్లను నియమించాలని రాష్ట్ర ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
ఉద్యాన ఉత్పత్తుల రవాణా
ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు రైల్ కనెక్టివిటీ పెంచాలని సీఎం చంద్రబాబు అన్నారు. పుష్కరాల నాటికి రాజమండ్రి, విజయవాడ స్టేషన్ల ఆధునీకరణ పూర్తి చేయాలన్నారు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం ఎంత వేగంగా సాగుతుందో, అంతే వేగం రైల్వే లైన్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. ఏపీని యూనిట్‌గా తీసుకుని రైల్వే ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అమృత్ పథకం కింద ఎంపికైన రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను 2027 కల్లా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాయలసీమ టూ కోస్తాంధ్ర
'రాయలసీమ - కోస్తాంధ్ర మధ్య కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలి. విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట తదితర రైల్వే జంక్షన్లలో రద్దీ తగ్గించే అంశంపైనా పరిష్కారాన్ని చూపాలి. రాజధాని అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం- నంబూర్ కొత్త రైల్వే లైన్ నిర్మాణ ప్రతిపాదనను త్వరగా పట్టాలెక్కించాలి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్ సహా అన్ని ప్రధాన నగరాలను అమరావతి కోర్ కేపిటల్‌తో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. కడప-బెంగుళూరు కొత్త బ్రాడ్ గేజ్ లైన్ పైనా వేగంగా చర్యలు చేపట్టాలి.' అని చంద్రబాబు అన్నారు.
పుష్కరాల నాటికి
విజయవాడ, గుంటూరులలో ప్రస్తుతం ఉన్న టెర్మినళ్లను విస్తరించాలని, అమరావతి, గన్నవరం టెర్మినళ్లను నూతనంగా నిర్మించే ప్రతిపాదనల్ని త్వరితగతిన కార్యరూపంలోకి తేవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరించాలని అధికారులకు సీఎం సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రైల్వే శాఖ ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 1,012 ప్రత్యేక రైల్ సర్వీసులను నడిపేందుకు, 2,370 రైల్వే కోచ్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే అధికారులు వివరించారు.
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్
విజయవాడ రైల్వే స్టేషన్‌ను పీపీపీ విధానంలో చేపడుతున్నామని రైల్వేశాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 2028లో జరిగే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 808 వరకూ ఉన్న రైల్వే క్రాసింగ్స్‌కు పరిష్కారం చూపేలా... రైల్వే లెవల్ క్రాసింగ్స్ ఇబ్బందులు లేకుండా ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణం చేపట్టాలని సీఎం చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ 2029 మార్చి కల్లా పూర్తి చేయాలన్నారు.
హైస్పీడ్ రైల్వే కారిడార్లు
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీ పెంచడంపైనా, విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు సహా రాష్ట్రంలో వివిధ కొత్త రైల్వే మార్గాలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూర్, హైదరాబాద్-బెంగళూరు లైన్లను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బెంగళూరు నుంచి చిత్తూరు, తిరుపతి మీదుగా అమరావతికి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు వచ్చేలా చూడాలన్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం సర్వేలు చేపట్టామని... 864 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈ కారిడార్ కోసం రూ.1,90,907 కోట్ల మేర వ్యయం అవుతుందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


