ఏపీ - తెలంగాణ నదీ జలాల వివాదం : కేంద్రం కీలక నిర్ణయం - ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ఏపీ - తెలంగాణ మధ్య నెలకొన్న నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ పని చేయనుంది. ఇందులో సభ్యులుగా రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులకు చోటు కల్పించింది. 

Published on: Jan 3, 2026, 15:32:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలపై కేంద్రం దృష్టి సారించింది. ఆయా అంశాలను చర్చించి పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఏపీ - తెలంగాణ జల వివాదాలు - కేంద్రం కీలక నిర్ణయం
ఏపీ - తెలంగాణ జల వివాదాలు - కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. మరో 12 మంది సభ్యులను నియమించారు. ఏపీ, తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వం తరపున పలువురు ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు కూడా సభ్యులుగా అవకాశం కల్పించారు.

ఢిల్లీ వేదికగా 2025 జులై 16న జరిగిన ముఖ్యమంత్రుల(ఏపీ - తెలంగాణ) స్థాయి మీటింగ్‌‌‌‌లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర జలశక్తిశాఖ పేర్కొంది. తెలంగాణ, ఏపీ నుంచి పలువురు అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించింది.

కమిటీలో సభ్యులు వీరే…

కమిటీ స్వరూపం చూస్తే… ఛైర్మన్ గా కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ ఉంటారు. ఏపీ ప్రభుత్వం తరపున జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ సభ్యులుగా ఉంటారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి నీటిపారుదలశాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సభ్యులుగా ఉంటారు.

ఏపీ - తెలంగాణ మధ్య నెలకొన్న నదీ వివాదాలను పరిష్కరించటమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపాల్సి ఉంటుంది. దీని ఆధారంగా 3 నెలలోపు కేంద్రానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

కొనసాగుతున్న ఫిర్యాదుల పర్వం…

ఏపీ - తెలంగాణ మధ్య చాలా ఏళ్లుగా నదీ జలాల వివాదం కొనసాగుతోంది. కృష్ణా, గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఫిర్యాదులపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తలపెట్టాలనుకున్న బనకచర్లను తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. పలు కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గినప్పటికీ… ఇప్పుడు పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకు అనుమతులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదు చేయగా.. ఇటీవలే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జనవరి 5న విచారణ జరిగే అవకాశం ఉంది.

ఈ అంశాలే కాకుండా.. గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన పలు ప్రాజెక్టులను కూడా ఏపీ సర్కార్ తెరపైకి తీసుకువస్తోంది. కొన్ని ప్రాజెక్టులకు పూర్తిస్తాయి అనుమతులు, నీటి కేటాయింపులు లేకుండానే చేపట్టిందని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే…. కేంద్ర జలశక్తి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భేటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి..? నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది…!

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More