గోదావరి జిల్లాల వాసులకు శుభవార్త - నరసాపురం వరకు 'వందే భారత్ ట్రైన్' పొడిగింపు, ఇవిగో వివరాలు

చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నర్సాపురం వరకు పొడిగించిన వందే భారత్ ట్రైన్…. ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది.

Published on: Nov 7, 2025, 17:04:52 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గోదావరి జిల్లాల ప్రజలకు గుడ్ న్యూస్. ఇకపై వందే భారత్ ట్రైన్ సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చెన్నై-విజయవాడ మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్…. ఇకపై నరసాపురం వరకూ ప్రయాణించనుంది.

వందే భారత్ ట్రైన్ (ఫైల్ ఫొటో)
వందే భారత్ ట్రైన్ (ఫైల్ ఫొటో)

కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి (నర్సాపురం ఎంపీ) భూపతిరాజు ​శ్రీనివాస వర్మ చాలా రోజులుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోసం పట్టుబడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా హామీనిచ్చారు. నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకువస్తాని చెప్పారు. ఆ తర్వాత నర్సాపురం నుంచి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ…. పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. సర్వీస్ పొడిగింపుపై కసరత్తు పూర్తి చేసిన రైల్వేశాఖ అధికారులు… తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నరసాపురం వరకు వందే భారత్ ట్రైన్ రాకపోకలు కొనసాగించనుంది.

టైమింగ్స్ ఇలా….!

వందేభారత్ ట్రైన్ ను నర్సాపురం వరకు పొడిగించిన నేపథ్యంలో…. ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. ట్రైన్ నంబర్ 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపురం వరకు, అలాగే రైలు నంబర్ 20678 నర్సాపురం నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు నడవనుంది.

చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి ( ట్రైన్ నెంబర్ - 20677) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్లో ఆగుతుంది. విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:34 గంటలకు గుడివాడ, 1:29 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలోరైలు (ట్రైన్ నెంబర్ 20678) నర్సాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:19 గంటలకు భీమవరం టౌన్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 4:09 గంటలకు గుడివాడ, 4:50 గంటలకు విజయవాడకు చెన్నైకు రాత్రి 23.45 గంటలకు చేరుకుంటుంది. ఈ సర్వీస్ అధికారిక ప్రారంభ తేదీపై రైల్వే శాఖ ప్రకటన చేయనుంది.

కేంద్రమంత్రి కృతజ్ఞతలు:

నర్సాపురం వరకు వందే భారత్ రైలును పొడిగించటంపై కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ అయిన భూపతిరాజు ​శ్రీనివాస వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

“నేను ఎన్నికల సమయంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ రైలు తీసుకొస్తా అన్న హామీని నెరవేర్చుకున్నాను. సహకరించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు. నర్సాపురం - చెన్నై తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించాలని తెలుపుతూ కేంద్ర రైల్వే శాఖ నుండి దక్షిణ మధ్య రైల్వేకు ఆదేశాలు అందాయి. నర్సాపురం, భీమవరం, గుడివాడ స్టేషన్లో హాల్ట్ ఉంటుంది. వందే భారత్ నర్సాపురం వరకు పొడిగించడానికి ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి సహకరించిన దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే అధికారుల సమన్వయం అభినందనీయం” అని పేర్కొన్నారు.

కేంద్రానికి ధన్యవాదాలు - డిప్యూటీ స్పీకర్

చెన్నై నుండి విజయవాడ వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించటంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

“గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి ఇచ్చిన వినతి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నిరంతర కృషి, రైల్వే శాఖ వారి సహకారంతో ఇది సాకారమైంది. త్వరలోనే హైదరాబాద్ నుంచి నరసాపురం వరకు నడిచే మరొక వందే భారత్ ట్రైన్ ప్రారంభమయ్యేలా మేమందరం కృషి చేస్తాం"అని రఘురామ తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More