Sai Krishna Custodial Death Case : విజయవాడలో తీవ్ర కలకలం రేపిన కృష్ణలంక పోలీసు కస్టడీ మరణం కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వేగవంతం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘోర ఉదంతంపై సీబీఐ కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం సీబీఐ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను నేరుగా సందర్శించి సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు.
కృష్ణలంక పీఎస్ పరిశీలన….

సీబీఐ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేంద్ర దేవ్ నాయకత్వంలోని ఎనిమిది మంది అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం పీఎస్‌కు చేరుకుంది. సాయికృష్ణను బంధించి విచారించారని ఆరోపణలు ఉన్న పోలీస్ స్టేషన్ రెండో అంతస్తును అధికారులు పూర్తిగా తనిఖీ చేశారు. ఈ దర్యాప్తును సీబీఐ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శివ సుబ్రమణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నిపుణుల సాయంతో శనివారం నాటికి సీబీఐ బృందం పీఎస్ ఆవరణలో సాంకేతిక ఆధారాలను సేకరించే పనిని ప్రారంభించిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి జూన్ 4న దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై అక్టోబర్ 16న విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కస్టడీ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బాధితుడి తల్లి విజయలక్ష్మికి నాలుగు వారాల్లోగా రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అంతేకాకుండా, బాధ్యులైన పోలీసు సిబ్బందిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది. వెంటనే నిబంధనల ప్రకారం నేరపూరిత కేసు నమోదు చేసి, సీనియర్ అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. కస్టడీ హింసకు బాధ్యులైన అధికారులందరిపై చట్టప్రకారం విచారణ జరిపి శిక్షించాలని కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం రోజునే రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సేకరించిన పత్రాలను, ఆధారాలను సీబీఐ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇందులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర రికార్డులు, నిందితుల రిమాండ్ నివేదికలు ఉన్నాయి. అనంతరం సీబీఐ నమోదు చేసిన నూతన ఎఫ్‌ఐఆర్ ప్రతిని నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఇన్ఛార్జ్) కోర్టులో సమర్పించింది. సీల్డ్ కవర్ రూపంలో ఒక మెమోరాండంను కూడా న్యాయస్థానానికి అందజేసింది.
{{/usCountry}}హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం రోజునే రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సేకరించిన పత్రాలను, ఆధారాలను సీబీఐ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇందులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర రికార్డులు, నిందితుల రిమాండ్ నివేదికలు ఉన్నాయి. అనంతరం సీబీఐ నమోదు చేసిన నూతన ఎఫ్‌ఐఆర్ ప్రతిని నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఇన్ఛార్జ్) కోర్టులో సమర్పించింది. సీల్డ్ కవర్ రూపంలో ఒక మెమోరాండంను కూడా న్యాయస్థానానికి అందజేసింది.
{{/usCountry}}మరోవైపు, సాయికృష్ణపై క్రిమినల్ నేరాల వివరాలు, అతడిపై పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల సంఖ్యపై క్రైమ్ కంట్రోల్ సెక్షన్ (సిసిఎస్) నుంచి సీబీఐ నివేదిక కోరింది. ఈ అంశంపై సాయికృష్ణ తల్లిని కూడా అధికారులు త్వరలోనే విచారించనున్నారు.
ఇదే సమయంలో, సస్పెండ్ అయిన ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్‌వివి నాగరాజుకు అత్యంత సన్నిహితుడైన గులివిందల సురేష్ కుమార్ (A4)తో పాటు వెంకటరాజు (A7) ఇళ్లలో సోదాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరగా… న్యాయస్థానం ఇందుకు అనుమతి ఇచ్చింది.
సిట్ ఇప్పటికే స్థానిక న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేసి, 13 మంది పాత్రను స్పష్టంగా పేర్కొంది. ఘటనతో సంబంధం ఉన్న పోలీసులతో పాటు నాగరాజు అనుచరుడు సురేష్ కుమార్‌ను, విచారణలో వెలుగులోకి వచ్చిన మరో ముగ్గురిని నిందితులుగా చేర్చింది.
కేసు నేపథ్యం ఏంటి…?
- పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా మే 6న తెల్లవారుజామున 3 గంటలకు మార్కాపురం వద్ద సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- ఉదయం 7 గంటలకు అతడిని కృష్ణలంక పీఎస్‌కు తీసుకువచ్చారు. కానీ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవరికీ తెలియకుండా పోయింది.
- తన కుమారుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి జూన్ 4న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
- ఆ తర్వాత జూన్ 19న విజయవాడ పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రభుత్వం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ ని ఏర్పాటు చేసింది.
- జూన్ 23న ఇన్‌స్పెక్టర్ నాగరాజు సహా పలువురు కానిస్టేబుళ్లను ఎస్ఐటీ అరెస్టు చేసింది.
- సుదీర్ఘ విచారణ అనంతరం సెప్టెంబర్ 19న ఎస్ఐటీ తుది ఛార్జిషీట్ దాఖలు చేసింది.
- ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మే 12న విజయవాడలోని ఒక పాడుబడిన భవనంలో కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి కొట్టి చంపారని, అదే రోజు రాత్రి అతడి మృతదేహాన్ని దహనం చేశారని సిట్ నిర్ధారించింది.
ఇప్పుడు సీబీఐ…. సిట్ సేకరించిన సాక్ష్యాలను, ఛార్జిషీట్‌ను సమగ్రంగా పరిశీలిస్తూ స్వతంత్రంగా తదుపరి విచారణను వేగవంతం చేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.