...
...
Next Story

స్టార్ హీరోలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, చిన్న సినిమాలకు థియేటర్లు దక్కనివ్వడం లేదు: నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కామెంట్స్

Manoj Bajpayee About Small Budget Movies: సినీ పరిశ్రమలో పెద్ద సినిమాల గుత్తాధిపత్యం పెరిగిపోతోందని, దీనివల్ల చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదని నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చిన్న సినిమాలకు కనీస స్క్రీన్ల గ్యారెంటీ ఇచ్చేలా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు.

Published on: Jun 21, 2026, 06:52:14 IST
Advertisement

Manoj Bajpayee About Small Budget Movies: సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాల హవా నడుస్తోంది. ఈ క్రమంలో వైవిధ్యమైన కథలతో వచ్చే చిన్న సినిమాలు, స్వతంత్ర (ఇండిపెండెంట్) చిత్రాలు థియేటర్లు దొరక్క అల్లాడిపోతున్నాయి.

జాతీయ అవార్డు గ్రహీత

స్టార్ హీరోలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, చిన్న సినిమాలకు థియేటర్లు దక్కనివ్వడం లేదు: నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కామెంట్స్
స్టార్ హీరోలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, చిన్న సినిమాలకు థియేటర్లు దక్కనివ్వడం లేదు: నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కామెంట్స్

ఈ తీవ్రమైన సమస్యపై జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఘాటుగా స్పందించారు. భారతీయ సినీ రంగంలో చిన్న, పెద్ద సినిమాల మధ్య సమానమైన అవకాశాలు (లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఉండాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

నిజానికి ఈ స్క్రీన్ల కొరత సమస్య కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. టాలీవుడ్‌లో కూడా సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్లలో పెద్ద సినిమాలు థియేటర్లన్నింటినీ ఆక్రమించుకోవడం, ఆ సమయంలో చిన్న సినిమాలు విడుదలకు నోచుకోకపోవడం లేదా ఒకే ఒక్క షోతో సర్దుకుపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మనోజ్ బాజ్‌పాయ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.

ప్రభుత్వాల నుంచే ఆ భరోసా రావాలి

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ మహిళా దర్శకురాలు రీమా కాగ్తీ మాట్లాడుతూ, చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి కేవలం 'మద్దతు' (Support) మాత్రమే సరిపోదని, వ్యవస్థల నుంచి 'ఆదరణ' (Patronage) లభించాలని అభిప్రాయపడ్డారు. దీనిపై మనోజ్ బాజ్‌పాయ్ స్పందిస్తూ, మౌలిక సదుపాయాల పరంగా ప్రభుత్వం నుంచి రక్షణ కావాలని కోరారు.

ప్రభుత్వం నుంచి తమకు కావలసింది ఆర్థిక సహాయం కాదని, తాము తీసిన సినిమా ప్రేక్షకులకు చేరువయ్యేలా థియేటర్ల ప్రదర్శనలో కనీస గ్యారెంటీ ఇచ్చే చట్టాలు మాత్రమేనని మనోజ్ బాజ్‌పాయ్ వివరించారు.

మహారాష్ట్ర ప్రభుత్వ పాలసీని ఉదాహరణగా చూపిస్తూ..

ఈ సమస్యకు గల పరిష్కారాన్ని వివరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక మంచి విధానాన్ని మనోజ్ గుర్తుచేశారు. ముంబై లాంటి మెట్రో నగరంలో హిందీ చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) హవా అత్యధికంగా ఉన్నప్పటికీ, అక్కడ స్థానిక మరాఠీ సినిమాలకు కచ్చితంగా కొన్ని థియేటర్లు, ప్రైమ్ టైమ్ షోలు కేటాయించాలనే నిబంధన ఉంది.

"మరాఠీ సినిమాకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద వరంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ చిత్రాలకు, చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా కనీస సంఖ్యలో స్క్రీన్లు కేటాయించేలా ఇలాంటి గ్యారెంటీ అంతటా దక్కాలి" అని మనోజ్ బాజ్‌పాయ్ డిమాండ్ చేశారు.

పెద్ద సినిమాల బెదిరింపులు.. థియేటర్ల యాజమాన్యాల లొంగుబాటు

సినిమా పంపిణీ, ప్రదర్శన వ్యవస్థలను పెద్ద స్టూడియోలు, స్టార్ హీరోలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే చేదు నిజాలను మనోజ్ బాజ్‌పాయ్ బయటపెట్టారు. "భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ పవర్‌ను చూపిస్తూ థియేటర్ల యజమానులను, ఎగ్జిబిటర్లను భయపెడుతున్నారు. బలవంతంగా మెజారిటీ షోలను వారే దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు" అని మనోజ్ బాజ్‌పాయ్ ఆరోపించారు.

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ పాత్రలో మనోజ్..

ఈ గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవడానికి చట్టపరమైన నిబంధనలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సరికొత్త చిత్రం ‘గవర్నర్’ (Governor) గత వారాంతంలో థియేటర్లలో విడుదలైంది. అయితే పెద్ద సినిమాల పోటీ వల్ల ఈ చిత్రానికి చాలా పరిమితంగా థియేటర్లు దక్కాయి.

చిన్మయ్ డి. మాండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ ఎస్. వెంకిటరమణన్ పాత్రలో మనోజ్ నటించారు. 1990ల కాలంలో భారతదేశం ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని ఆయన ఎలా గట్టెక్కించారనే చారిత్రక అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

థియేటర్లు దొరక్కపోవడం

ఇలాంటి గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా థియేటర్లు దొరక్కపోవడం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks