Raja Shivaji: 100 కోట్లు రాబట్టిన జెనీలియా భర్త మూవీ రాజా శివాజీ- రెండో మరాఠీ చిత్రంగా రికార్డ్- పదేళ్లకు సాధ్యమైన ఘనత
Raja Shivaji Get 100 Cr Collection After 10 Years In Marathi: మరాఠీ సినీ చరిత్రలో రితేష్ దేశ్‌ముఖ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో మరాఠీ సినిమాగా రికార్డు కెక్కింది.
Raja Shivaji Get 100 Cr Collection After 10 Years In Marathi: భారతీయ చలనచిత్ర రంగంలో వంద కోట్ల వసూళ్లు సాధించడం అనేది ఒకప్పుడు కేవలం బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలకే సాధ్యమయ్యేది. కానీ ప్రాంతీయ సినిమాలు సైతం కంటెంట్ బాగుంటే రికార్డులను తిరగరాయగలవని మరాఠీ చిత్రసీమ మరోసారి నిరూపించింది.

థియేటర్లలో కాసుల వర్షం
మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ' చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. వంద కోట్ల మైలురాయిని దాటి మరాఠీ ఇండస్ట్రీ స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పింది.
గతంలో 2016లో నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వం వహించిన 'సైరాట్' చిత్రం మొదటిసారిగా రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. అంటే సరిగ్గా పదేళ్లకు ఆ రికార్డును రాజా శివాజీ బ్రేక్ చేయగలిగింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మరాఠీ సినిమా రంగానికి ఆ మైలురాయిని చేరడానికి శతాబ్దం పైగా సమయం పట్టిందన్నమాట.
ఆ తర్వాత గత పదేళ్లలో ఏ ఒక్క మరాఠీ సినిమా కూడా ఆ రికార్డు దరిదాపుల్లోకి రాలేకపోయింది. ఇప్పుడు రితేష్ దేశ్‌ముఖ్ ఆ రికార్డులను బద్దలు కొడుతూ మరాఠీ సినిమా సత్తాను చాటారు. మన తెలుగు ప్రేక్షకులకు 'బాహుబలి', 'రుద్రమదేవి' వంటి చారిత్రక సినిమాలు ఎంతటి గర్వకారణమో, మరాఠీ ప్రజలకు 'రాజా శివాజీ' అంతటి భావోద్వేగంగా మారింది.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ
మొదటి రోజు నుంచే భారీ అంచనాలతో బరిలోకి దిగిన 'రాజా శివాజీ' తొలి వారాంతంలోనే (ఫస్ట్ వీకెండ్) రూ. 30 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి శుభారంభం అందుకుంది. వర్కింగ్ డేస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తూ మొదటి వారం ముగిసేసరికి రూ. 52.65 కోట్లు, రెండో వారం నాటికి రూ. 77 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడో వారాంతంలో మరోసారి బాక్సాఫీస్ వద్ద పుంజుకుని రూ. 7.60 కోట్లు సాధించింది.
మొత్తంగా 17 రోజులు పూర్తి చేసుకునే సరికి ఈ చిత్రం దేశీయంగా రూ. 84.55 కోట్ల నెట్ వసూళ్లను (రూ. 100 కోట్ల గ్రాస్) సాధించింది. సాధారణంగా మరాఠీ సినిమాలకు ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ సినిమాను కూడా విదేశాల్లో విడుదల చేయలేదు.
కేవలం దేశీయ మార్కెట్ కలెక్షన్స్‌తోనే వంద కోట్ల క్లబ్‌లో రాజా శివాజీ చేరడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఆదివారం (మే 17) ఒక్క రోజే ఈ సినిమా రూ. 4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
'సైరాట్' రికార్డుకు చేరువగా..
కుల వివక్షత నేపథ్యంలో వచ్చిన ప్రేమకథ చిత్రం 'సైరాట్' ఇప్పటివరకు రూ. 110 కోట్ల లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్స్‌తో మరాఠీ చిత్రసీమలో టాప్ 1 ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం 'రాజా శివాజీ' నడుస్తున్న వేగాన్ని చూస్తుంటే నాలుగో వారంలోనే ఈ రికార్డును అధిగమించి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరాఠీలో ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలు (బాయిపన్ భారీ దేవా, వేద్, నటసామ్రాట్) మాత్రమే రూ. 50 కోట్ల మార్కును దాటాయి. ఇందులో 'వేద్' సినిమాలో కూడా రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించారు. దీనిబట్టి టాప్-5 మరాఠీ చిత్రాలలో రెండు సినిమాలు రితేష్ ఖాతాలోనే ఉండటం విశేషం.
భారీ తారాగణం.. జెనీలియా నిర్మాణం
ఈ ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రానికి రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా కథను అందించి దర్శకత్వం వహించారు. ముంబై ఫిల్మ్ కంపెనీ, జియో స్టూడియోస్ బ్యానర్లపై రితేష్ భార్య, హీరోయిన్ జెనీలియా డిసౌజా, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
సల్మాన్ ఖాన్ కెమియో
ఈ చిత్రంలో రితేష్, జెనీలియాతో పాటు బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో మెరిశారు. అలాగే మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. సల్మాన్ ఖాన్ కెమియో కూడా ఉంది. నటీనటుల అద్భుత నటన, అద్భుతమైన నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని ఇంతటి ఘన విజయానికి చేర్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


