ఐశ్వర్య రాజేష్ తెలుగు కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. వెరైటీ టైటిల్‌తో వస్తున్న సిరీస్.. ఇక్కడ చూసేయండి
ఐశ్వర్య రాజేష్ ఇప్పుడో తెలుగు కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తోంది. జియోహాట్‌స్టార్ లో రానున్న ఈ సిరీస్ ఎంతగానో ఆసక్తి రేపుతోంది. ఆ ఓటీటీలో వచ్చే ఏడాది ఎన్నో కొత్త తెలుగు సినిమాలు, సిరీస్ రానుండగా.. అందులో ఇదీ ఒకటి.
డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ దక్షిణాది కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతోంది. అందులో భాగంగానే తాజాగా 'మూడు లాంతర్లు' (Moodu Lantharlu) అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. ఇందులో విశేషమేమిటంటే 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది.

ఎన్టీఆర్ 'మద్యపాన నిషేధం' నాటి కథ
ఈ వెబ్ సిరీస్ కథాంశం చాలా భిన్నంగా ఉండబోతోంది. ఇది 90వ దశకం ఆరంభంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ఒక చిన్న పట్టణంలో మందు దొరక్క జనం పడే పాట్లు, మందు కోసం వారు చేసే సాహసాలు, దాని చుట్టూ అల్లుకున్న గమ్మత్తైన పరిస్థితులే ఈ 'మూడు లాంతర్లు' కథ. ఓటీటీలో తనదైన మార్క్ వేసిన నటుడు కార్తీక్ రత్నం ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్
ఈ మూడు లాంథర్లు వెబ్ సిరీస్‌కు వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ గురించి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
"నేను ఈ కథ విన్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. ఓటీటీ స్పేస్ కోసం ఇలాంటి ఒక కాన్సెప్ట్‌ను ఎలా ఊహించారా అనిపించింది. ఈ సిరీస్‌లో కావాల్సినంత కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్, టెన్షన్ ఉన్నాయి. ఇది కచ్చితంగా నా కెరీర్‌లో ఉత్తమమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుంది" అని ఐశ్వర్య తెలిపింది.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని జియోహాట్‌స్టార్ త్వరలోనే ప్రకటించనుంది. సీరియస్ పాత్రలే కాకుండా ఇలాంటి కామెడీ థ్రిల్లర్‌లో ఐశ్వర్యను చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
జియోహాట్‌స్టార్ దూకుడు
సౌత్ అన్‌బౌండ్ పేరుతో జియోహాట్‌స్టార్ ఓటీటీ మెగా ఈవెంట్ కు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లోనే జియోహాట్‌స్టార్‌లో 2026లో రాబోతున్న 40 సినిమాలు, సిరీస్ లు, షోల టైటిల్స్ ను రివీల్ చేశారు. మంగళవారం అంటే డిసెంబర్ 9న చెన్నైలో ఈ ఈవెంట్ జరిగింది. జియోహాట్‌స్టార్ సౌత్ అన్‌బౌండ్ ఈవెంట్ కు లెజెండరీ స్టార్లు వచ్చారు. తెలుగులో సేవ్ ద టైగర్స్ సీజన్ 3ని కూడా ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


