Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరోకు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా రావాలంటూ!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ కు నాంపల్లి కోర్టు వ్యక్తిగత సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఏ-11గా ఉన్న ఆయనను వచ్చే సోమవారం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
Allu Arjun: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద తొక్కిసలాట కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు వ్యక్తిగత సమన్లు జారీ చేసింది. వచ్చే సోమవారం ఆయన కచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

అల్లు అర్జున్ కు సమన్లు
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును నాంపల్లి హై కోర్టు తీవ్రంగా పరిగణించింది. అందుకే అల్లు అర్జున్‌తో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 19 మంది నిందితులకు సమన్లు పంపింది. ఈ కేసులో దాఖలైన చార్జ్‌షీట్‌లో పోలీసులు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది.
అసలేం జరిగిందంటే?
'పుష్ప 2: ది రూల్' సినిమా విడుదలను పురస్కరించుకుని 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తన అభిమానులను అలరించేందుకు హీరో అల్లు అర్జున్ స్వయంగా థియేటర్ వద్దకు వచ్చారు.
అయితే, ముందస్తు అనుమతులు లేకుండా, సరైన ప్లాన్ లేకుండా అల్లు అర్జున్ ర్యాలీలా రావడంతో అక్కడ ఒక్కసారిగా అరాచక వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్‌ను చూసేందుకు వేలాది మంది అభిమానులు ఒకేసారి ఎగబడటంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది.
ఒకరి మృతి
ఈ దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చాలా నెలల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు విచారణ జరిపారు. ఈ ఈవెంట్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, క్రౌడ్ మేనేజ్‌మెంట్ పూర్తిగా విఫలమైందని తేల్చారు.
థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులతో పాటు నిబంధనలు ఉల్లంఘించి అక్కడికి వచ్చినందుకు అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై కూడా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మరోవైపు బాధితురాలి కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబం అండగా నిలుస్తోంది.
23 మంది
మొత్తం 23 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చగా, ప్రస్తుత విచారణల అనంతరం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ (A11) సహా 19 మందికి తాజాగా సమన్లు జారీ చేయడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. చట్టప్రకారం సోమవారం అల్లు అర్జున్ న్యాయమూర్తి ముందు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక రాత్రి జైల్లో
అయితే ఇదే కేసులో అల్లు అర్జున్ ను గతంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను జైలుకు తరలించారు. అయితే హై కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


