అనగనగా ఒక రాజు రివ్యూ-నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో- ఆపరేషన్ చారు సక్సెస్ అయిందా?కామెడీ కలిసొచ్చిందా?
సంక్రాంతికి భీమవరం రాజుగా హంగామా చేయడానికి థియేటర్లలోకి వచ్చేశాడు నవీన్ పొలిశెట్టి. అతను హీరోగా నటించిన అనగనగా ఒక రాజు మూవీ ఇవాళ రిలీజైంది. మరి మూవీ ఎలా ఉంది? కామెడీ వర్కౌట్ అయిందా? నవీన్ కు హిట్ దక్కిందా? అన్నది అనగనగా ఒక రాజు రివ్యూలో చూసేయండి.
టైటిల్: అనగనగా ఒక రాజు

నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, గోపరాజు రమణ, తారక్ పొన్నప్ప, మహేశ్, చమ్మక్ చంద్ర, భద్రం, మాస్టర్ రేవంత్ తదితరులు
దర్శకత్వం: మారి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: యువరాజ్
ఎడిటింగ్: వంశీ అట్లూరి
రిలీజ్ డేట్: జనవరి 14, 2026
సంక్రాంతి 2026 రేసులో పెద్ద సినిమాలు ఉన్నాగానే నవీన్ పొలిశెట్టి ధైర్యం చేసి అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కు సై అన్నాడు. సినిమాలోని కంటెంట్ మీద అతనికి ఉన్న నమ్మకం అలాంటిది. భీమవరం రాజుగా ట్రైలర్ లో నవీన్ అల్లరి, మీనాక్షి చౌదరితో కెమిస్ట్రీ మూవీపై అంచనాలు పెంచేశాయి.
పర్ఫెక్ట్ పండగ సినిమాలా అనగనగా ఒక రాజు మూవీని రెడీ చేయడంతో సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. మరి ఇవాళ రిలీజైన ఈ మూవీ ఆకట్టుకుందా? నవీన్ కామెడీ పని చేసిందా? మీనాక్షితో అతని కెమిస్ట్రీ ఎలా ఉంది? అనేది ఈ రోజు అనగనగా ఒక రాజు రివ్యూలో చూసేద్దాం.
కథ
గౌరవపురం జమీందారు గోపరాజు. ఆయన మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). ఊరితో తాతకు పెద్ద పేరు ఉంటుంది. కానీ ఆస్తులే ఉండవు. అప్పట్లో ఆడవాళ్ల కోసం ఉన్న ఆస్తినంతా హారతి కర్పూరం చేసేస్తాడు గోపరాజు. ఉన్న పేరును ఉపయోగించుకుని డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామనుకుంటాడు రాజు.
అప్పుడే పెద్దిపాలెం భూపతి రాజు (రావు రమేష్) కూతురు చారు (మీనాక్షి చౌదరి)ను చూస్తాడు. ఆమెకు కోట్ల ఆస్తి ఉందని తెలుసుకుంటాడు. ఎలాగైనా చారును పడేయాలని ‘ఆపరేషన్ చారు’ స్టార్ట్ చేస్తాడు. దాని కోసం ఎన్నో తంటాలు పడతాడు. చివరకు చారుతో పెళ్లి జరుగుతుంది. కానీ ఫస్ట్ నైట్ రోజు రాజుకు ఓ లెటర్ వస్తుంది. దీంతో కథ మలుపు తిరుగుతుంది.
అసలు ఆ లెటర్ ఎవరు రాశారు? అందులో ఏముంది? పెద్దిపాలెం ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎర్రిబాబు (తారక్ పొన్నప్ప)కు పోటీగా రాజు ఎందుకు నిలబడ్డాడు? అన్నది సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ
ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ స్టైల్ వేరు. ఆడియన్స్ ను నవ్వించడంలో ముందుటాడు. జాతిరత్నాలు సినిమాలో నవీన్ చేసిన సందడి చూశాం. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీలోని అదే కామెడీ టైమింగ్ తో దూసుకుపోయాడు. కథ, కథనం ఊహించదిగిందే అయినా కామెడీతో మూవీ అదరగొట్టింది.
ఆస్తి లేకపోయినా రిచ్ అంటూ బిల్డప్ ఇచ్చే రాజు, అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా వన్ లైన్ పంచ్ లు బాగా పేలాయి. ఇక రాజు, చారు మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
ఇక సెకండాఫ్ లో కథ మొత్తం ముఖ్యంగా ఎన్నికలపైకి మళ్లుతుంది. రాజు నామినేషన్ వేయడం, ఎన్నికల ప్రచారం కూడా కావాల్సినంత ఫన్ అందిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్లు కూడా వర్కౌటయ్యాయి. క్లైమాక్స్ కూడా కన్వీన్స్ గా ఉంటుంది.
నటీనటులు ప్రదర్శన
కామెడీ చేయడం నవీన్ పొలిశెట్టికి కొత్తేం కాదు. అతని డైలాగ్ లో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. అనగనగా ఒక రాజు మూవీని ఇదే కామెడీ టైమింగ్ తో వన్ మ్యాన్ షోలా నడిపించాడు నవీన్. రాజుగా ఆయన చేసిన హంగామా సినిమాను నిలబెట్టింది. ఇక మీనాక్షి చౌదరి వరుసగా రెండో సంక్రాంతికి కూడా అదరగొట్టింది.
నవీన్ తో కెమిస్ట్రీ ఆమెకు బాగా కుదిరింది. రావు రమేష్ పాత్రకు కూడా సినిమాలో ప్రాధాన్యం దక్కింది. రాజు గ్యాంగ్ గా చమ్మక్ చంద్ర, మహేష్, భద్రం నవ్వించారు. ఇక వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మాస్టర్ రేవంత్ కూడా మరోసారి ఆడియన్స్ మనసు దోచుకున్నాడు.
సాంకేతిక విభాగం
టెక్నికల్ గానూ అనగనగా ఒక రాజు మూవీ బాగుంది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా సినిమాను పండగలా తీర్చదిద్దారు. కథ కాస్త పాతదే అనిపించినా నవీన్ కామెడీతో మూవీని డైరెక్టర్ మారి మలిచిన తీరు మెప్పిస్తుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ మూవీకి ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇక రచన మూవీకి మరో బలం.
ఫైనల్ గా
ఫైనల్ గా చెప్పాలంటే సంక్రాంతికి ఫ్యామిలీస్ హాయిగా థియేటర్లో ఎంజాయ్ చేసే మూవీ అనగనగా ఒక రాజు. కథ పరంగా కాస్త వీక్ ఉన్న రాజుగా నవీన్ పొలిశెట్టి ఎక్కడ బోర్ కొట్టనివ్వడు. ఇది పక్కా పండగ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.

E-Paper












