Biopic: ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్‌తో సీఎం చర్చలు- మొఘలులను వణికించిన వీరుడి బయోపిక్- రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు

Aditya Dhar To Direct Lachit Borphukan Biopic: బాలీవుడ్ సంచలన సిరీస్ 'ధురంధర్' చిత్రాల దర్శకుడు ఆదిత్య ధర్‌తో భారీ చారిత్రక బయోపిక్ తీసేందుకు అస్సాం ప్రభుత్వం సిద్ధమైంది. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అహోం వీరుడు లచిత్ బోర్ఫుకాన్ వీరగాథను బయోపిక్‌గా పట్టాలెక్కించనున్నారు.

Published on: Jul 18, 2026, 10:58:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Aditya Dhar To Direct Lachit Borphukan Biopic: భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా చారిత్రక వీరుల బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రాంతీయ వీరుల కథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దేశవ్యాప్తంగా దర్శకులు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాయి.

ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్‌తో సీఎం చర్చలు- మొఘలులను వణికించిన వీరుడి బయోపిక్- రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు
ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్‌తో సీఎం చర్చలు- మొఘలులను వణికించిన వీరుడి బయోపిక్- రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు

ఈశాన్య భారత రక్షణ కోసం

ఈ క్రమంలోనే ఈశాన్య భారత రక్షణ కోసం ప్రాణాలర్పించిన అహోం సైన్యాధ్యక్షుడు లచిత్ బోర్ఫుకాన్ వీరగాథను భారీ హిందీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న 'ధురంధర్' చిత్రాల దర్శకుడు ఆదిత్య ధర్ చేతుల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను పెట్టాలని అస్సాం ప్రభుత్వం భావిస్తోంది.

ఫేస్‌బుక్ లైవ్‌లో సీఎం సంచలన ప్రకటన

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా కోసం తాము ఇప్పటికే ఆదిత్య ధర్‌ను సంప్రదించినట్లు చెప్పారు. "ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. నేటి తరం దర్శకుల్లో ఆదిత్య ధర్ అత్యంత ప్రతిభావంతుడు" అని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

లచిత్ బోర్ఫుకాన్ అసమాన శౌర్యాన్ని ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు పరిచయం చేయాలంటే బాలీవుడ్ స్థాయిలో ఒక భారీ హిందీ చిత్రం అవసరమని ఆయన నమ్ముతున్నారు. అప్పుడే మన దేశ చరిత్రలోని అన్‌సంగ్ హీరోల త్యాగాలు అందరికీ తెలుస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆగస్టులో కీలక చర్చలు.. బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు

ముఖ్యమంత్రి ప్రతిపాదనకు ఆదిత్య ధర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కథాంశం, మేకింగ్ విధానంపై మరింత లోతుగా చర్చించడానికి ఆయన రాబోయే ఆగస్టు నెలలో అస్సాం పర్యటనకు రానున్నారు.

అయితే ఒకవేళ ఆదిత్య ధర్ వేరే ప్రాజెక్టుల వల్ల బిజీగా ఉండి ఈ సినిమా చేయలేకపోతే, మరో టాప్ డైరెక్టర్‌ను ఎంపిక చేస్తామని సీఎం స్పష్టం చేశారు. దర్శకుడు ఎవరైనా సరే.. లచిత్ బోర్ఫుకాన్ బయోపిక్‌ను అత్యంత వైభవంగా నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.

అస్సాం సాంస్కృతిక వైభవాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు అక్కడి ప్రభుత్వం ఒక విస్తృత ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల జూలై 10న ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో లచిత్ బోర్ఫుకాన్‌తో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు కుశాల్ కొన్వర్ జీవిత కథలపై సినిమాలను నిర్మించడానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.

అసలు ఎవరీ లచిత్ బోర్ఫుకాన్? మనకు ఎందుకు తెలియాలి?

ఉత్తర భారతదేశంపై మొఘలుల దండయాత్రలను తిప్పికొట్టిన అజేయ వీరుడిగా లచిత్ బోర్ఫుకాన్‌కు చరిత్రలో ప్రత్యేక స్థానముంది. 1671లో జరిగిన చారిత్రక 'సారైఘాట్ యుద్ధం'లో అహోం సామ్రాజ్య సైన్యానికి నాయకత్వం వహించిన ఆయన, మొఘల్ సైన్యాన్ని మట్టికరిపించారు. అస్సాం మట్టిని మొఘలుల వశం కాకుండా కాపాడటంలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, దేశ రక్షణే ధ్యేయంగా యుద్ధరంగంలోకి దూకి సైనికుల్లో వీరోచిత ఉత్సాహాన్ని నింపిన మహా యోధుడు లచిత్ బోర్ఫుకాన్. అస్సాం ప్రజలు ప్రతి ఏటా ఆయన గుర్తుగా 'లచిత్ దివస్' జరుపుకుంటారు. భారత సైనిక చరిత్రలో ఆయన చూపిన ధైర్యసాహసాలను గౌరవిస్తూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ఉత్తమ క్యాడెట్‌కు ప్రతి ఏటా 'లచిత్ బోర్ఫుకాన్ గోల్డ్ మెడల్' అందిస్తుంది.

'ధురంధర్' విజయంతో టాప్ గేర్‌లో ఆదిత్య ధర్

దర్శకుడు ఆదిత్య ధర్ ప్రస్తుతం తన 'ధురంధర్', దాని సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాల భారీ విజయాలతో బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. తన తదుపరి చిత్రం ఏంటనేది ఆయన ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో అస్సాం సీఎం ప్రతిపాదించిన చారిత్రక బయోపిక్‌ను ఆయన పట్టాలెక్కిస్తే.. భారతీయ సినిమా హిస్టరీలో మరో విజువల్ వండర్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More