95 కోట్ల బడ్జెట్, ఒక్కరోజే 366 కోట్ల కలెక్షన్స్- 20 ఏళ్ల కుర్రాడి సంచలనం- బాక్సాఫీస్‌ను వణికిస్తున్న బ్యాక్‌రూమ్స్

Backrooms 3 Days Collection And Budget: ఇంటర్నెట్ వైరల్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన సైకలాజికల్ హారర్ చిత్రం బ్యాక్‌రూమ్స్ హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఒక్కరోజులోనే 366 కోట్లు రాబట్టింది. మరి 3 రోజుల్లో బ్యాక్‌రూమ్స్ కలెక్షన్స్ ఎంతో లుక్కేద్దాం.

Published on: Jun 1, 2026, 10:50:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Horror Thriller Backrooms 3 Days Collection And Budget: హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని అద్భుతం జరిగింది. ఎలాంటి భారీ స్టార్ కాస్ట్ లేకుండా, కేవలం ఒక ఇంటర్నెట్ వైరల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఒక చిన్న హారర్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అదే 'బ్యాక్‌రూమ్స్' (Backrooms).

95 కోట్ల బడ్జెట్, ఒక్కరోజే 366 కోట్ల కలెక్షన్స్- 20 ఏళ్ల కుర్రాడి సంచలనం- బాక్సాఫీస్‌ను వణికిస్తున్న బ్యాక్‌రూమ్స్
95 కోట్ల బడ్జెట్, ఒక్కరోజే 366 కోట్ల కలెక్షన్స్- 20 ఏళ్ల కుర్రాడి సంచలనం- బాక్సాఫీస్‌ను వణికిస్తున్న బ్యాక్‌రూమ్స్

హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ

కేవలం 20 ఏళ్ల వయసున్న యువ దర్శకుడు కేన్ పార్సన్స్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ 'A24' చరిత్రలోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది.

మే 29, 2026న అంతర్జాతీయంగా థియేటర్లలోకి వచ్చిన బ్యాక్‌రూమ్స్ సినిమా ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేసింది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'వెరైటీ' కథనం ప్రకారం.. విడుదలైన మొదటి రోజే (శుక్రవారం) ఈ చిత్రం 38.4 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ. 366 కోట్లు) కలెక్షన్స్ రాబట్టింది.

మూడు రోజుల్లో

ఇందులో గురువారం రాత్రి ప్రీవ్యూల ద్వారా వచ్చిన 10.4 మిలియన్ డాలర్లు కూడా ఉన్నాయి. మొదటి వీకెండ్ (మూడు రోజుల్లో) ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా 85 నుంచి 90 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 810 కోట్లకు పైగా) కలెక్షన్లను సాధించే దిశగా దూసుకుపోతోంది. కేవలం 10 మిలియన్ డాలర్ల (రూ. 95 కోట్లు) పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజే లాభాల బాట పట్టడం డిజిటల్ క్రియేటర్ల సత్తాను చాటిచెప్పింది.

స్టార్ వార్స్ రికార్డులు బద్దలు!

అంతకుముందు A24 సంస్థ పేరిట ఉన్న 'సివిల్ వార్' (2024) సినిమా రికార్డును (25.5 మిలియన్ డాలర్లు) ఈ చిత్రం సులువుగా దాటేసింది. అంతకంటే పెద్ద విశేషం ఏంటంటే.. వందల కోట్ల భారీ బడ్జెట్‌తో డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు' సినిమా కలెక్షన్లను సైతం ఈ చిన్న చిత్రం అధిగమించింది. గత వారం విడుదలైన స్టార్ వార్స్ చిత్రం మొదటి వీకెండ్‌లో 81.6 మిలియన్ డాలర్లు రాబట్టగా, 'బ్యాక్‌రూమ్స్' అంతకంటే ఎక్కువ వసూళ్లతో దూసుకుపోతోంది.

అసలు కథేంటి? శూన్యంలో దాగున్న భయం!

ఫర్నిచర్ దుకాణం నడుపుకుంటూ జీవించే క్లార్క్ (చివెటెల్ ఎజియోఫర్) అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్న తరుణంలో, అతని షోరూమ్ బేస్‌మెంట్‌లో ఒక వింతైన, వెలుగులు చిమ్మే రహస్య ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం గుండా వెళ్లిన క్లార్క్‌కు పసుపు రంగు గోడలతో, ఎలాంటి మనుషులు లేని అంతులేని గదుల మాయా ప్రపంచం (బ్యాక్‌రూమ్స్) కనిపిస్తుంది.

ఆ వింత లోకంలో చిక్కుకున్న క్లార్క్ మెల్లగా తన మానసిక స్థితిని కోల్పోయి అక్కడే అదృశ్యమవుతాడు. క్లార్క్ ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించిన అతని థెరపిస్ట్ మేరీ (రెనేట్ రీన్స్‌వే) కూడా అదే రహస్య ద్వారం ద్వారా ఆ భయంకరమైన నరకంలోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు సినిమా. మార్క్ డూప్లాస్, బెన్నెట్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హారర్ చిత్రాల స్పెషలిస్ట్ జేమ్స్ వాన్, షాన్ లెవీ వంటి హాలీవుడ్ టాప్ నిర్మాతలు అండగా నిలిచారు.

ఇంటర్నెట్ పోస్ట్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు..

ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన ప్రయాణం ఉంది. ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన 'క్రీపీపాస్టా' (భయపెట్టే కథలు/చిత్రాలు) ఆధారంగా ఈ కాన్సెప్ట్ పుట్టింది. రెడ్డిట్ (Reddit), 4చాన్ (4chan) వంటి ప్లాట్‌ఫామ్‌లలో పసుపు రంగు ఖాళీ హాల్స్ ఉన్న ఒక ఫోటో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫోటో చుట్టూ నెటిజన్లు రకరకాల హారర్ కథలు అల్లారు.

ఈ ఐడియా నచ్చి, కేన్ పార్సన్స్ అనే కుర్రాడు తన టీనేజ్ వయసులో (2022లో) సొంతంగా విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుని యూట్యూబ్‌లో ఒక షార్ట్ ఫిల్మ్ విడుదల చేశాడు. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అయిన A24 సంస్థ, కేన్‌కు ఫ్రీగా ఫిల్మ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చింది. తద్వారా ఈ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో సినిమా చేసిన అత్యంత పిన్న వయస్కుడైన దర్శకుడిగా కేన్ రికార్డు సృష్టించాడు.

ఇండియా రిలీజ్ ఎప్పుడు?

అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఈ సైకలాజికల్ హారర్ చిత్రం మన భారతీయ ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త సమయం పడుతుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తోంది.

అంతర్జాతీయ విడుదలతో పోలిస్తే రెండు వారాల ఆలస్యంగా, అంటే జూన్ 12, 2026న బ్యాక్‌రూమ్స్ భారతీయ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

హారర్ చిత్రాలను అమితంగా ఇష్టపడే భారతీయ సినిమా ప్రియులకు 'బ్యాక్‌రూమ్స్' ఒక సరికొత్త థ్రిల్‌ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More