Shah Rukh Khan: నాడు సమోసాలు అమ్మిన పదేళ్ల కుర్రాడు.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి 'కింగ్'.. షారుఖ్ ఈ సీక్రెట్ తెలుసా?
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా. కానీ అతడు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? తాజాగా నటుడు పంకజ్ కపూర్.. షారుఖ్ తండ్రి క్యాంటీన్, అతడు సమోసాలు అమ్మిన విషయాన్ని గుర్తు చేశాడు.
Shah Rukh Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ ఐకాన్‌గా, వేల కోట్ల బాక్సాఫీస్ సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతిగా వెలుగొందుతున్న 'బాద్‌షా' షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. లెజెండరీ యాక్టర్ పంకజ్ కపూర్ (Pankaj Kapur) తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) లో చదువుకునే రోజుల్లో ఒక 10 ఏళ్ల చిన్నారి తమకు బ్యాక్‌స్టేజ్‌లో సమోసాలు, టీ ఎలా సరఫరా చేసేవాడో వివరించారు.

ఆ రోజుల్లో తమ ఆకలి తీర్చిన ఆ చిన్న బాలుడే.. నేడు యావత్ ప్రపంచం గర్వించేలా బాలీవుడ్ ‘కింగ్ ఖాన్’గా ఎదగడం వెనుక ఉన్న ఒక అందమైన మనసుకు హత్తుకునే ఓ సంఘటన గురించి వెల్లడించారు.
పంకజ్ కపూర్ 50 ఏళ్ల వేడుక.. పాత జ్ఞాపకాల జాతర
ఇటీవల 'కిండ్లే కాస్ట్' (Kindle Cast) యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంకజ్ కపూర్ మాట్లాడుతూ తన ఎన్‌ఎస్‌డీ రోజులను గుర్తుచేసుకున్నారు. తాను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి పట్టా పుచ్చుకుని యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా, పాత క్లాస్‌మేట్స్ అందరికీ తన నివాసంలో ఒక గెట్-టు-గెదర్ పార్టీ ఇచ్చినట్లు చెప్పారు.
ఆ సమయంలో పాత ఢిల్లీలోని పురానా ఖిల్లా బ్యాక్‌డ్రాప్‌లో నాటి ప్రసిద్ధ థియేటర్ డైరెక్టర్ ఇబ్రహీం అల్కాజీ దర్శకత్వంలో తాము చేసిన స్టేజ్ నాటకాల ముచ్చట్లు గుర్తొచ్చాయని అన్నారు. అప్పట్లో అల్కాజీ ఒకేసారి రజియా సుల్తాన్, తుగ్లక్, అంధా యుగ్ అనే మూడు భారీ నాటకాలను ఏకకాలంలో డైరెక్ట్ చేసేవారని పంకజ్ కపూర్ గుర్తుచేసుకున్నారు.
ఆకలి తీర్చిన నాన్, సమోసాల సీక్రెట్ ప్లాన్
రజియా సుల్తాన్ నాటకం ప్రదర్శిస్తున్న సమయంలో జరిగిన ఒక సరదా ఘటనను పంకజ్ కపూర్ పంచుకున్నారు. "ఆ నాటకంలో ఒక సీన్ ఉంటుంది. రాజు ముందు ఆకలితో ఉన్న ప్రజలంతా గుమిగూడి అరుస్తుంటారు. అప్పట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయిన నేను, నా ఫ్రెండ్స్ ఆ గుంపులో ఉన్నాము. మా క్లాస్‌మేట్స్ ఇద్దరు సైనికుల పాత్రలు పోషిస్తూ మా వైపు రొట్టెలు విసిరేయాలి. మేము ఒక సీక్రెట్ ప్లాన్ వేసి.. వాళ్లు విసిరిన రొట్టెలను పట్టుకుని, ఇంటర్వెల్ సమయంలో కాంటీన్ నుండి సమోసాలు, టీ తెప్పించుకుని బ్యాక్‌స్టేజ్‌లో అందరం కలిసి దావత్ చేసుకునేవాళ్లం. అయితే ఒకరోజు మా నటనలో తేడాను గమనించిన డైరెక్టర్ అల్కాజీ మమ్మల్ని పట్టుకుని గట్టిగా మందలించారు" అని నవ్వుతూ చెప్పారు.
ఆ సమోసాలు తెచ్చింది మరెవరో కాదు.. పదేళ్ల షారుఖ్ ఖాన్
ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే నాటక బృందానికి బ్యాక్‌స్టేజ్‌లోకి ఆ సమోసాలను సప్లై చేసిన చిన్న బాలుడు మరెవరో కాదు.. స్వయంగా మన షారుఖ్ ఖాన్. "అప్పట్లో మాకు సమోసాలు తెచ్చి ఇచ్చిన ఆ అబ్బాయి వయసు కేవలం పదేళ్లు. వాళ్ల నాన్నగారు ఎన్‌ఎస్‌డీలో కాంటీన్ నడిపేవారు" అని పంకజ్ కపూర్ ఆనాటి మధుర జ్ఞాపకాన్ని రివీల్ చేశారు.
గతంలో 2016లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ సైతం ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు. "నేను అధికారికంగా ఎన్‌ఎస్‌డీలో చదువుకోలేదు కానీ మా నాన్న అక్కడ కాంటీన్ రన్ చేయడం వల్ల అక్కడి నటులతో నాకు మంచి అనుబంధం ఉండేది. మనోజ్ బాజ్‌పాయ్, నేను ఎన్‌ఎస్‌డీ నటులైన రఘువీర్ యాదవ్ వంటి దిగ్గజాలతో కలిసి ఢిల్లీలో థియేటర్ చేసేటప్పుడు వాళ్ల దగ్గర కూర్చుని డైలాగ్ డెలివరీ, ఉచ్చారణ నేర్చుకునేవాడిని. నా తండ్రి కాంటీన్ వల్లే నాకు ఇంతటి గొప్ప నటుల పరిచయాలు దక్కాయి" అని కింగ్ ఖాన్ నాడు చెప్పుకొచ్చారు.
లెజెండరీ నటుడు పంకజ్ కపూర్ ప్రస్థానం
థియేటర్ బ్యాక్‌డ్రాప్ నుండి వచ్చిన పంకజ్ కపూర్ భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత గౌరవనీయమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మక్బూల్, జానే భీ దో యారో, ఏక్ డాక్టర్ కీ మౌత్, ద బ్లూ అంబ్రెల్లా, షాహిద్ కపూర్ హీరోగా వచ్చిన 'జెర్సీ' సినిమాల్లో ఆయన చేసిన నటన క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై 'కరమ్‌చంద్', 'ఆఫీస్ ఆఫీస్' లాంటి ఐకానిక్ షోలతో ఆయన దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.
డిసెంబర్‌లో బాక్సాఫీస్ వేట మొదలుపెట్టనున్న ‘కింగ్’
మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను అందించి 'బాద్‌షా'గా నిలిచిన షారుఖ్ ఖాన్.. ప్రస్తుతం తన అప్‌కమింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్' (King) సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నాడు. 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ లేడీ లీడ్స్‌గా నటిస్తున్నారు.
ఈ మూవీలో రాఘవ్ జుయల్, సౌరభ్ శుక్లా, అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిక్ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


